Suryakumar Yadav: భారత జట్టు విజయం కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. జట్టు యాజమాన్యం అవకాశం ఇస్తే బౌలింగ్ కూడా చేస్తానని చెప్పాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచులో సూర్య కుమార్ (34: 36 బంతుల్లో 5×4) రాణించాడు.
'తొలి మ్యాచ్‌లో వికెట్ కాపాడుకుంటూ నిలకడగా ఆడాను. రెండో మ్యాచ్‌లో కూడా దాన్ని కొనసాగిస్తాను. క్రీజులో కుదురుకుని స్వేచ్ఛగా ఆడితే చాలు. పరుగులు వాటంతటా అవే వస్తాయి. జట్టు కోసం నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దమే. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం నాకేమీ కొత్త కాదు. జట్టు యాజమాన్యం ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా చేస్తాను. ఓపెనర్‌గా బరిలోకి దిగినా.. ఇలాగే ఆడతాను. భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. జట్టు అవసరాలను బట్టి బౌలింగ్ చేసేందుకు కూడా నేను సిద్దమే. ఇప్పటికీ రెగ్యులర్‌గా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అవకాశం వస్తే కచ్చితంగా బౌలింగ్ చేస్తాను. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అందుబాటులోకి రావడంతో మా జట్టు మరింత బలోపేతమైంది. అయితే, రెండో వన్డేలో ఎవరికి అవకాశమివ్వాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనే విషయంపై జట్టు యాజమాన్యం తుది నిర్ణయం తీసుకుంటుంది. నన్ను సూర్యకుమార్‌లాగే ఉండనివ్వండి. వేరే వాళ్లతో పోల్చొద్దు. భారత క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను.' అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
సూర్యకుమార్ ఇప్పటి వరకు ఆడిన వన్డే, టీ20 మ్యాచుల్లో.. అవసరాన్ని బట్టి 3, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలోనూ అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును గెలిపించాడు.
ఇవీ చూడండి: Team India U19: కొత్తగా '19 ప్లస్' టీమ్.. బీసీసీఐ యోచన
'క్రికెట్ వదిలేసి ఆటో తోలుకో అన్నారు- మహీ చెప్పిన ఆ మాటతో..'