Suryakumar Yadav News: భారత జట్టు కోసం అవసరమైతే బౌలింగ్ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ (34) నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున ఫినిషర్ పాత్ర పోషించడాన్ని ఆస్వాదిస్తున్నానని అతడు పేర్కొన్నాడు.
"జట్టు కోసం అవసరమైతే బౌలింగ్ చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బౌలర్లు నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తున్పప్పుడు వారికి బౌలింగ్ చేస్తూ మెలకువలు నేర్చుకుంటున్నాను. దాంతో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి ఆఖరి వరకు క్రీజులో ఉండటం చాలా ముఖ్యమని నేను భావిస్తాను.
జట్టు విజయానికి మరో 20-25 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ఔటైతే చాలా బాధగా ఉంటుంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెంకటేశ్ అయ్యర్ పూర్తి సానుకూల దృక్పథంతో ఆడతాడు. అతడి నుంచి చక్కటి మద్దతు లభించింది. మేమిద్దరం ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుని గెలిపించాలనుకున్నాం" అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
ఈ మ్యాచులో వెంకటేశ్ అయ్యర్ (24) పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి 26 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను గెలిపించారు.
"భారత్ తరఫున చాలా కాలంగా ఆడుతున్న రోహిత్ శర్మ ఆట గురించి మనందరికీ తెలుసు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ధాటిగా ఆడతాడు. మొదటి ఆరు ఓవర్లోనే (పవర్ ప్లే) వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాడు. సరైన టైమింగ్‌తో షాట్లు ఆడుతూ పరుగులు రాబడతాడు. అలాగే, ఆడుతున్న తొలి మ్యాచులోనే రవి బిష్ణోయ్ అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై అరంగేట్రం చేసే గొప్ప అవకాశం అతడికి దక్కింది. ఆరంభంలో కొంచెం తడబడినా.. ఆ తర్వాత పుంజుకున్నాడు.
తన వ్యూహాలను పక్కాగా అమలు చేసి.. విజయవంతమయ్యాడు. మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర జట్లలో వెస్టిండీస్ ఒకటి. అందుకే, ఒక్క మ్యాచులో ఓడిపోయినంత మాత్రాన విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. సిరీస్ నిర్ణయాత్మక రెండో మ్యాచు రసవత్తరంగా సాగుతుందనుకుంటున్నాను’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
తొలి టీ20లో.. బంతితో 2/17 ప్రదర్శన చేసిన రవి బిష్ణోయ్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: జోష్‌లో టీమ్ ఇండియా.. టీ20 సిరీస్‌పై విజయంపై దృష్టి