వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తొలి వన్డేలో స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటైన సూర్య.. రెండో వన్డేలోనూ అతడి బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరి అందరినీ నిరాశ పరిచాడు. సూర్య ఇలా తొలి బంతికే ఔట్ కావడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో మూడో వన్డేలో అతడిని ఆడిస్తారా? లేదంటే జట్టు నుంచి తప్పిస్తారా? అన్న ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో తలెత్తుతోంది.
టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. వన్డేల్లో మాత్రం ఇప్పటికీ కుదురుకోలేకపోతున్నాడు. 22 వన్డే ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. వన్డేల్లో అతడి యావరేజ్ 25.47గా ఉంది. ఆఖరి పది ఇన్నింగ్స్‌లు చూసుకుంటే 0, 0, 14, 31, 4, 6, 34, 4, 8, 9 పరుగులు చేశాడు. అతడు అర్ధశతకం కొట్టి.. సంవత్సరం దాటిపోయింది. టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కు సూర్య ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది. అయితే నెట్టింట మాత్రం సూర్య.. తెగ ట్రోల్స్‌కు గురవతున్నాడు. ఇంకెన్ని ఛాన్స్‌లు ఇస్తారని టీమ్ మేనేజ్మెంట్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సూర్యను తప్పించి సంజూ శాంసన్‌కు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితేా వన్డేల్లో సూర్య బ్యాటింగ్ వైఫల్యం విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో తెలీదన్న రోహిత్.. అప్పటి వరకూ నాలుగో స్థానం ఖాళీ ఉంటుందని తెలిపాడు. ఆ స్థానంలో సూర్యను ఆడిస్తామని చెప్పాడు. వైట్ బాల్ క్రికెట్లో తానేంటో ఇప్పటికే సూర్య చాటాడన్న రోహిత్.. సత్తా ఉన్న ఆటగాళ్లకు తాము అవకాశాలు ఇవ్వాలని అన్నాడు. "వన్డేల్లోనూ తాను మెరుగ్గా ఆడాల్సి ఉందనే విషయం సూర్యకు కూడా తెలుసు. అదే అతడి మదిలోనూ మెదులుతూ ఉంటుంది. సత్తా ఉన్న ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తాం. ఫలానా స్థానంలో తనకు సరిపడా అవకాశాలు రాలేదని ఆటగాళ్లెవరూ అనుకోవద్దు" అని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికిప్పుడే సూర్యను తుది జట్టు నుంచి తప్పించే ఉద్దేశంలో టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ లేదనే విషయాన్ని రోహిత్ వెల్లడించాడు. మరిన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత అతడి ఆటతీరుపై నిర్ధరణకు వస్తామన్నాడు. మరో 7-8 మ్యాచ్‌లు ఆడితే సూర్య వన్డేల్లోనూ మరింత సౌకర్యవంతంగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. సూర్య తొలి బంతికే ఔట్ కాకుండా.. కుదురుకోవడానికి సమయం చిక్కితే బాగా ఆడేవాడంటూ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా అన్నాడు.
కాగా, సూర్యకు కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలవడంతో.. మార్చి 22న చెన్నై వేదికగా జరగనున్న చివరి వన్డేలో సూర్య కుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత్ ఆడనున్న చివరి మ్యాచ్ ఇదే కావడంతో సూర్య ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని ఫ్యాన్స్‌తోపాటు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. మరేం చేస్తాడో చూడాలి!