Gujarat Titans Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా వేలం ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. కొంత మంది ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోగా.. గతంలో అద్భుత ప్రదర్శన చేసిన కొంతమంది ప్లేయర్లపై ఫ్రాంఛైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన సురేశ్ రైనాకు అదృష్టం జేసన్ రాయ్ రూపంలో తలుపుతట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ జట్టు రెండు కోట్లకు సొంతం చేసుకున్న జేసన్ రాయ్.. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో అతడి స్థానంలో సురేష్ రైనాను భర్తీ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రైనాను చేర్చుకుంటే జట్టుకు బలం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జేసన్ మాదిరిగా రైనా కూడా విధ్వంకరంగా ఆడగలడని, అందుకే చేర్చుకోమని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం కూడా రైనాను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వినిపిస్తోంది. రైనాకు కూడా అంతకుముందు గుజరాత్ లయన్స్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. ఐపీఎల్ కెరీర్లో మొత్తం రైనా 205 మ్యాచులు ఆడాడు. 135 స్ట్రైక్‌రేట్‌తో 5528 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 39 అర్ధసెంచరీలున్నాయి. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలో దిగుతోంది. మరి అభిమానుల కోరిక మేరకు సురేష్ రైనాను గుజరాత్ టైటాన్స్ తీసుకుంటుందో లేదో వేచి చూడాలి,.
ఇదీ చదవండి: కోహ్లీ వందో టెస్టు.. ఈ సారైనా సెంచరీ బాదుతాడా?