ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను భారత జట్టు 4-0 లేదా 3-1తేడాతో ఓడిస్తుందని ఈ సిరీస్‌కు ముందు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అంచనా వేశాడు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే తాను చేసేది ఏమీ లేదని అన్నాడు.
లార్డ్స్ వేదికగా ఆగస్టు 16న ముగిసిన రెండో టెస్టులో టీమ్ఇండియా చిరస్మరణీయ విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన గావస్కర్ ఈ విధంగా స్పందించాడు.
"ఇంగ్లాండ్ ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్ల జట్టు. బ్యాటింగ్‌లో జో రూట్, బౌలింగ్‌లో అండర్సన్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. మిగతావాళ్లు నామమాత్రంగా ఆడుతున్నారు. ఇది సరైన టెస్టు జట్టుగా అనిపించడం లేదు. వారి ఓపెనర్ల బ్యాటింగ్ టెక్నిక్ మరీ పేలవంగా ఉంది. మూడో స్థానంలో హమీద్ ఒత్తిడితో ఆడుతున్నాడు. రూట్ ఒక్కడే అద్భుతంగా రాణిస్తున్నాడు. బట్లర్ వన్డే, టీ20 ప్లేయర్. టెస్టు ఆటగాడని కచ్చితంగా చెప్పలేను. బౌలింగ్‌లో అండర్సన్ ఒక్కడే రాణిస్తున్నాడు. మొత్తంగా ఇంగ్లాండ్ ఇద్దరు ఆటగాళ్ల జట్టు. నేను సిరీస్ ఆరంభానికి ముందే చెప్పా.. టీమ్ఇండియా 4-0 లేదా 3-1తేడాతో సిరీస్ గెలుస్తుందని. ఇప్పటికీ అదే నమ్ముతున్నా. వర్షం పడి మ్యాచ్‌లకు అంతరాయం కలగకపోతే నా అంచనా నిజం కావొచ్చు."
-గావస్కర్, టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్.
ఇరు జట్ల మధ్య ఆగస్టు 25 నుంచి మూడో టెస్టు జరగనుంది. హెడింగ్లే వేదికగా ఈ పోరులో తలపడనున్నాయి రెండు జట్లు.
ఇదీ చూడండి: 'ఇంగ్లాండ్ భయపడిందని అప్పుడే అర్థమైంది'