Sunil Gavaskar on Team India Gabba victory: యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. అయితే ఇదే వేదికపై ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్‌పై భారత్ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఈ విజయం విలువ మరింత పెరిగిందని అంటున్నాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. అలాగే యాషెస్ సిరీస్ తొలి టెస్టులో బ్రాడ్‌ను పక్కనపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంకా అతడు ఏం మట్లాడాడో అతడి మాటాల్లోనే..
"గబ్బా మళ్లీ ఆస్ట్రేలియన్ల కంచుకోటలా మారింది. యాషెస్ తొలి టెస్టులో ఆ జట్టు ఇంగ్లాండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మూడున్నర రోజుల్లో ఆ జట్టు సాధించిన ఘనవిజయం.. ఇదే వేదికలో ఈ ఏడాది ఆరంభంలో భారత్ సాధించిన గెలుపు విలువను మరింత పెంచింది. ఆ మ్యాచ్‌లో 329 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఇంకా వికెట్లు, ఓవర్లు, సమయం మిగిలుండగానే సులువుగా ఛేదించింది భారత్. ఈ సిరీస్ విజయాన్ని భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. భారత క్రికెట్ చరిత్రలో అది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రత్యేక అధ్యాయం."
IND vs SA Series: "ఇప్పుడిక భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధమవుతోంది. అక్కడ ఇప్పటిదాకా టీమ్‌ఇండియా సిరీస్ గెలవలేదు. 2011లో ధోనీ నాయకత్వంలో ఆడినపుడు డ్రా చేయడాన్ని మినహాయిస్తే ప్రతిసారీ సిరీస్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఇప్పుడు చాలా బలహీనంగా మారిన నేపథ్యంలో ఈసారి భారత్ సిరీస్ గెలవడానికి మంచి అవకాశాలున్నాయి. టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్లకు చాలినంత విశ్రాంతి లభించింది. వాళ్లు తాజాగా ఉన్నారు. సిరీస్ ఆరంభానికి ముందు మూడు రోజుల మ్యాచ్ ఒకటి ఉంటే బాగుండేది. కానీ కొవిడ్ కొత్త వేరియెంట్ ప్రభావం వల్ల ఇందుకు అవకాశం లేకపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన సెంచూరియన్‌లో తొలి టెస్టు ఆడబోతుండటం భారత్‌కు కలిసొచ్చే విషయం. జొహానెస్‌బర్గ్, కేప్‌టౌన్‌ల్లో బౌన్సీ పిచ్‌లపై ఆడే ముందు ఇక్కడ బ్యాటర్లు లయ అందుకోవడానికి అవకాశముంటుంది. అయితే దక్షిణాఫ్రికా బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం మాత్రం అంత తేలిక కాదు."
Ashes 2021: "ఇక మళ్లీ యాషెస్ విషయానికొస్తే.. తొలి టెస్టుకు అండర్సన్, బ్రాడ్‌లిద్దరినీ దూరం పెట్టడం ఇంగ్లాండ్ చేసిన పెద్ద తప్పు. వయసు మీద పడ్డ ఈ ఇద్దరూ వరుసగా రెండు టెస్టులు ఆడలేరని విశ్రాంతినిచ్చినట్లున్నారు. గత పర్యాయం గులాబి బంతితో అండర్సన్ విజృంభించిన నేపథ్యంలో అడిలైడ్‌లో తర్వాత జరగబోయే డేనైట్ టెస్టుకు అతణ్ని తాజాగా ఉంచడం కోసం విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ బ్రాడ్‌ను ఎందుకు పక్కన పెట్టినట్లు. 2019 యాషెస్‌లో అతను.. వార్నర్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి టెస్టులో బ్రాడ్ ఉంటే.. వార్నర్ ఆటలు సాగేవి కావేమో. క్రీజులో కుదురుకుంటే అతనెంత ప్రమాదకారో అందరికీ తెలిసిందే. గబ్బాలో విలువైన 94 పరుగులు సాధించడమే కాక, లబుషేన్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తెచ్చాడు. అయితే స్టోక్స్ బంతి పక్కటెముకలకు బలంగా తాకడం వల్ల రెండో టెస్టుకు వార్నర్ అందుబాటులో ఉండట్లేదు. గబ్బాలో స్టోక్స్ వేసిన చాలా నోబాల్స్‌ను సాంకేతికత గుర్తించలేదు. ఈ మ్యాచ్‌లో స్నికో మీటర్ వైఫల్యాన్ని కూడా చూశాం. ఇలాంటివే భారత్‌లో జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. స్వయంగా భారతీయులే బీసీసీఐ మీద విరుచుకుపడిపోయేవారు. క్రికెట్ మీద రాతలు రాస్తూ బతికేవాళ్లే ఈ పని అందరికంటే ముందు చేస్తారు. మనకు అన్నం పెట్టే చేతినే తినేయడం లాంటిదే ఇది" అంటూ గావస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.