సునీల్ గావస్కర్.. భారత క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం. ఆయన తరంలో భయంకరమైన బౌలర్లను అవలీలగా ఎదుర్కొన్నాడు. విండీస్, ఆసీస్ వంటి బౌన్సీ పిచ్‌ల మీద పరుగుల వరద పారించాడు. హెల్మెట్ లేకుండా, కఠినమైన పిచ్‌లపై ఆడుతూ పాడుతూ రన్స్ చేశాడు. టెస్టుల్లో తొలిసారిగా పది వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. సగటున 140 కి.మీ.లకు తగ్గకుండా స్పీడ్‌తో బంతులను విసిరే బౌలర్లను ఎదుర్కొన్నాడు. అలాంటి విధ్వంసకర ఆటగాడు కూడా ఓ ఇద్దరు బౌలర్లకు భయపడ్డాడనే విషయం ఎంత మందికి తెలుసు? స్వయంగా ఈ విషయాన్ని సన్నీనే వివరించాడు.
"జెఫ్ థామ్సన్, ఆండీ రాబర్ట్స్.. ఈ ఇద్దరు బౌలర్లను ఎదుర్కోవడానికి నేను ఇబ్బందిపడ్డా. మీరు ఎంత బాగా ఆడుతున్నా వీరిద్దరి బౌలింగ్‌లో ఔట్ అవ్వాల్సిందే. నాణ్యమైన, కచ్చితమైన బౌలింగ్‌కు వీరు పెట్టింది పేరు. వీరిద్దరూ లైన్, లెంగ్త్‌కు కట్టుబడి బంతులు విసిరే వారు. మాల్కమ్ మార్షల్, రిచర్డ్ హాడ్లీ, ఇమ్రాన్ ఖాన్ వంటి బౌలర్లున్నా.. వారు ఓ మెట్టు కిందే ఉంటారు" అని గావస్కర్ తన తరంలోని బౌలర్ల గురించి వివరించాడు.
"ఇక ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్ పేర్లు చెప్పమని కోరగా.. నేను చూసిన అత్యుత్తమ బ్యాట్స్మన్లలో వివ్ రిచర్డ్స్ గొప్పవాడు. అందరూ అతడి పేరునే చెబుతారు. అలాగే నేను కూడా" అని సన్నీ చెప్పాడు.
ఇదీ చదవండి: WTC Final: టీమ్ఇండియా కూర్పుపై కివీస్ కోచ్ సూచనలు?