ఎంఎస్ ధోనీ(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు ఏం జరిగిందో యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) వివరించాడు. అతడు వీడ్కోలు పలుకుతాడన్న సంగతి జట్టులో ఎవరికీ తెలియదని పేర్కొన్నాడు. రాత్రి అందరిలాగే సోషల్ మీడియా ద్వారా తమకు విషయం తెలిసిందన్నాడు. మహీ ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడడని అర్థమయ్యేందుకు రెండు మూడు రోజులు పట్టిందన్నాడు.
"నిజానికి ఆ రోజు మేం దుబాయ్‌కు బయల్దేరాలి. చెన్నైలో ధోనీతో కలిసి 10-15 మంది సాధన చేశారు. కానీ అందులో ఎవరికీ ఈ విషయం తెలియదు. ఆ ఆగస్టు 15 కూడా మిగతా రోజుల్లాగే గడిచింది. సీఎస్‌కేలోని ఇతర ఆటగాళ్లలాగా నాకూ సోషల్ మీడియా ద్వారానే ధోనీ వీడ్కోలు గురించి తెలిసింది. ఆ రోజు సాయంత్రం 6:30కి సాధన ముగిసింది. మహీభాయ్ తప్ప మిగతా అందరం 7 గంటలకు భోజనం వద్ద కూర్చున్నాం. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహీ వీడ్కోలు పలికాడని ఎవరో చెప్పారు. భయంతో ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు."
- రుతురాజు గైక్వాడ్, చెన్నైసూపర్‌కింగ్స్ ఓపెనర్
ధోనీ వీడ్కోలు గురించి తెలియగానే ఇకపై అతడిని అంతర్జాతీయ క్రికెట్లో చూడలేమనే విషయం తన మదిలో తట్టిందని రుతురాజ్ అన్నాడు. అది అర్థమవ్వడానికి రెండు మూడు రోజుల సమయం పట్టిందని తెలిపాడు. అయితే గతేడాదే చెన్నై తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రుతురాజ్ ఆఖరి దశలో ఆకట్టుకున్నాడు. మొదట్లో అతడికి కరోనా వైరస్ సోకడం వల్ల సాధన చేసేందుకు కుదర్లేదు.
గతేడాది ఆగస్టు 15న ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పుడతను ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో సాధన చేస్తున్నాడు. అతడు వీడ్కోలు ప్రకటిస్తాడని నిజానికి ఎవ్వరూ ఊహించలేదు. హఠాత్తుగా సాయంత్రం సోషల్ మీడియాలో అంతర్జాతీయ క్రికెట్‌కు ఇకపై ఆడడన్న విషయం వీడియో రూపంలో తెలియజేశాడు. అతడి వెంటే సురేశ్ రైనా(Suresh Raina) సైతం చిన్న వయసులో రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇదీ చదవండి: 'సన్స్' చేతిలో ఔటైన 'సన్'- ఇదే తొలిసారి!