Srilanka Cricket New Law : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ సస్పెన్షన్ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు- ఎస్ఎల్సీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. ఈ మేరకు నవంబర్లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్- కమిటీ తమ నివేదికను సోమవారం సమర్పించింది. అందులో క్రికెట్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించేందుకు కొన్ని సూచనలు చేసింది.
శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ, ఎస్ఎల్సీని గాడిలో పెట్టడానికి సమగ్ర సంస్కరణలను ప్రతిపాదించామని తెలిపింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న ఎస్‌ఎల్‌సీ కూర్పు, నిర్మాణాన్ని సమీక్షించామని చెప్పింది. అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనకు గల కారణాలపై కూడా కమిటీ లోతైన విశ్లేషణ చేసింది. పాఠశాల, జిల్లా, ప్రాంతీయ స్థాయిలో నుంచి ఆటలో మార్పు చేయడానికి వ్యూహాలను గుర్తించింది.
అయితే రాజకీయ జోక్యం, తాత్కాలిక కమిటీల ఏర్పాటు కారణంగా ఎస్‌ఎల్‌సీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అలాంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కొత్త చట్టంలో విధివిధానాలు పొందుపరిచారని తెలుస్తోంది.
ఇదీ జరిగింది?
2023 వరల్డ్ కప్లో భాగంగా నవంబర్ 2న ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో లంక జట్టు భారత్ చేతిలో ఓడింది. ఈ ఘోర పరాజయం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇలా ప్రపంచకప్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు- (ఎస్‌ఎల్‌సీ)ను ఆదేశ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయంపై స్పందించిన శ్రీలంక కోర్టు బోర్డుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రద్దును ఉపసహరించుకోమంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ శ్రీలంక పార్లమెంట్ ఆ దేశ క్రికెట్ పాలకమండలిని తొలగించాలని తీర్మానించింది.
అయితే క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఐసీసీ ఆగ్రహవం వ్యక్తం చేసింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తమ బాధ్యతలను ఉల్లంఘించిందని ఐసీసీ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమావేశమైన ఐసీసీ బోర్డు శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధ్యక్షుడు విక్రమసింఘే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు- భారత్ చేతిలో ఘోర ఓటమే కారణం!
శ్రీలంక క్రికెట్ బోర్డుకు కోర్టులో ఊరట - రద్దు నిర్ణయం రివర్స్