Ganguly Dravid Coach: టీమ్ఇండియా హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ ద్రవిడ్‌ను ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశామని భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. తొలుత ఆ బాధ్యతలు స్వీకరించేందుకు ద్రవిడ్ ససేమిరా అన్నాడని స్పష్టం చేశాడు. ద్రవిడ్‌ను ఒప్పించలేక తను, బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ సందర్భంలో సహనం కూడా కోల్పోయినట్లు గంగూలీ వెల్లడించాడు. 'బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా' కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు దాదా.
"హెడ్ కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ స్వీకరిస్తేనే బాగుంటుందని నేను, జై షా చాలా కాలం నుంచి అనుకున్నాం. కానీ, జాతీయ సీనియర్ జట్టు బాధ్యతలు తీసుకుంటే దాదాపు 8-9 నెలలు కుటుంబం విడిచి తిరుగుతూనే ఉండాలి. పైగా ద్రవిడ్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ ససేమిరా అన్నాడు. అయినప్పటికీ ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాం. ఓ సందర్భంలో సహనం కోల్పోయాం. తర్వాత చాలా సార్లు ప్రత్యేకంగా మాట్లాడాం. కష్టంగా ఉన్నప్పటికీ రెండేళ్లు కోచ్‌గా ఉండమని నేను కోరాను. ఎట్టకేలకు ద్రవిడ్ బాధ్యతలు చేపట్టాడు."
--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
గంగూలీ, జై షా ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతే రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించాడు. అయితే.. ఆటగాళ్లు కూడా ద్రవిడ్ కోచ్‌గా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారని గంగూలీ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:
Ganguly on Team india: 'టీమ్ఇండియా అత్యంత పేలవ ప్రదర్శన అదే'