రెండు నెలల క్రితం నాన్న చనిపోయాడు. ఆమె శోకంలో మునిగిపోయి ఉంది. అదే సమయంలో ఐదేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. అది కూడా టెస్టు మ్యాచ్ అడే అవకాశం. నాన్న మరణం తాలూకు బాధ నుంచి ఇంకా కోలుకోకపోయినా టీమ్ఇండియాకు ఆడే అవకాశాన్ని వదులుకోకూడదని ఇంగ్లాండ్ విమానమెక్కింది. తొలి అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంది. టెస్టు అరంగేట్రంలోనే అదరగొట్టి జట్టును ఓటమిపాలు కాకుండా కాపాడింది. ఆ అమ్మాయే స్నేహ్ రాణా(Sneh Rana). ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో అసాధారణ పోరాటంతో జట్టును గట్టెక్కించిందీ ఉత్తరప్రదేశ్ ఆల్‌రౌండర్.
ఒకవైపు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీయడం సహా బ్యాటింగ్‌లోనూ అజేయ అర్ధసెంచరీతో సత్తాచాటింది స్నేహ్. 2014లోనే వన్డే, టీ20 జట్టులోకి వచ్చిన ఈమెకు ఇన్నాళ్లకు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. అది కూడా ఆమె తండ్రి భగవాన్ సింగ్ రాణా చనిపోయిన రెండు నెలలకు. తనను క్రికెటర్‌గా మార్చిన నాన్నకు నివాళిగా మళ్లీ మైదానంలోకి వచ్చింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శన
మొదట ఆఫ్ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన రాణా.. తర్వాత ఫాలో ఆన్‌లో జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న నిలిచిన సమయంలో బ్యాట్‌తో ఆదుకుంది. పదో నెంబర్ బ్యాట్స్‌మన్ తానియా భాటియా తోడుగా జట్టును పరాజయం నుంచి బయటపడేసింది. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులో కనీసం నాలుగు వికెట్లు తీసి, 50 ప్లస్ స్కోర్ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
"ఇవి ఉద్వేగభరిత క్షణాలు. తిరిగి భారత్‌కు ఆడాలని నాన్న కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లే జట్టులోకి రావడమే కాక.. టెస్టు అరంగేట్రంలోనే రాణించా. ఈ ప్రదర్శన నాన్నకే అంకితం. నేను భవిష్యత్‌లో ఏ మ్యాచ్ ఆడినా అది ఆయన కోసమే" అని మ్యాచ్ అనంతరం 27 ఏల్ల స్నేహ్ ఉద్వేగంగా చెప్పింది. ఈ టెస్టు కాకుండా ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున ఏడు వన్డేలు, ఐదు టీ20లు ఆడింది రాణా.