Smriti Mandhana: ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన. అన్ని ఫార్మాట్లలో అదిరిపోయే ప్రదర్శన చేసినందువల్ల ఈ రేసులో నిలిచింది స్మృతి. 'టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకూ గురువారం ఆమె నామినేట్ కావడం విశేషం.
2021లో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 అంతర్జాతీయ మ్యాచుల్లో 38.86 సగటుతో 855 పరుగులు చేసింది స్మృతి. అందులో ఒక సెంచరీ సహా ఐదు అర్ధ శతకాలున్నాయి. స్మృతితో పాటు టామీ బ్యూమంట్ (ఇంగ్లాండ్), లీజెల్ లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్ (ఐర్లాండ్).. మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఉన్నారు. విజేతను జనవరి 23న ప్రకటించనున్నారు.
పురుషుల రేసులో వీరే..
ఐసీసీ 'మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' రేసులో టీమ్ఇండియా క్రికెటర్లకు చోటు దక్కలేదు. ఈ అవార్డు కోసం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, పాకిస్థాన్ ద్వయం షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ పోటీ పడుతున్నారు. అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసినవారికి ఈ అవార్డు దక్కుతుంది. జనవరి 24న విజేతను ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా ప్లేయర్లకు ఏమైంది?.. ఆ రేసులోనూ లేరే