Akhtar about Kohli Captaincy: అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారిన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ విషయంలో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని హితవు పిలికాడు. కెప్టెన్సీ అంత సులువైన విషయం కాదని.. తీవ్ర ఒత్తిడి మధ్య బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని.. కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు.
కోహ్లీ గొప్ప ఆటగాడని.. క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ ఆడగలిగితే మరింత రాణిస్తాడని అక్తర్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ వివాదంలోనే చిక్కుకుపోకుండా వాటన్నింటినీ మరచిపోవాలని సూచించాడు. రానున్న ఆరునెలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే.. కెప్టెన్సీని వదులుకున్నందుకు ప్రతిఫలం దక్కినట్లేనని వ్యాఖ్యానించాడు. అలాగే 120 అంతర్జాతీయ శతకాలు సాధించగలనన్న విశ్వాసం తనలో వస్తుందని చెప్పాడు.
కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తీరుపై అక్తర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. కోహ్లీకి వ్యతిరేకంగా కొంతమంది వ్యవహారాలు నడిపారని ఆరోపించాడు. అందుకే అతను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లకు ఇబ్బందులు తప్పవన్నాడు. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. దేనికీ బెదరకుండా ఆటను ఆస్వాదించాలని హితవు పలికాడు. యావత్తు దేశం కోహ్లీని ప్రేమిస్తోందని గుర్తుచేశాడు! అయితే, కొన్ని సార్లు ఇటువంటి పరీక్షలు తప్పవని.. వాటి నుంచి ధైర్యంగా బయటకు రావాలని సూచించాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!