భారత్ క్రికెటర్ శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని అతడి భార్య ఆయేషాకు దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శిఖర్ ధావన్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన తప్పుడు ప్రసారాలు చేయటం సరికాదని న్యాయమూర్తి హరీష్ కుమార్ ఆయేషాకు ఆదేశించారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటం చాలా కష్టమన్న ఆయన ధావన్ పరువుకు భంగం కలిగే వ్యాఖ్యలు చేయటం సరికాదని అన్నారు. కాగా.. ప్రస్తుతం శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయేషా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తోందని ధావన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయేషాను అలా చేయొద్దని ఆదేశించింది.
కాగా, శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని 2012లో వివాహం చేసుకున్నాడు. ఆయేషాకు ధావన్‌తో ఇది రెండవ వివాహం. ధావన్‌ను చేసుకునే సమయానికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్ ధావన్‌ను వివాహం చేసుకున్నాక 2014లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే 2020లో వీరిద్దరికి మధ్య మనస్పర్థలు మొదలవ్వడం వల్ల.. ఈ వ్యవహారం విడాకుల దాకా వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి కుమారుడు జోరావర్ ధావన్ ప్రస్తుతం ఆయేషా దగ్గరే ఉంటున్నాడు.
మాజీ క్రికెటర్ ఫై భార్య కంప్లైంట్..
మరోవైపు భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఆయన భార్య ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి ఆమెను తీవ్రంగా తిట్టాడని.. కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం బాంద్రాలోని వారి నివాసానికి వచ్చిన కాంబ్లీ.. తీవ్ర మద్యం మత్తులో ఆమెను విచక్షణా రహితంగా కొట్టాడని ఆండ్రియా వాపోయారు. కాగా అడ్డుకోబోయిన తమ 12 ఏళ్ల కుమారుడిపై కాంబ్లీ చేయి చేసుకున్నాడని..అంతటితో ఆగకుండా వంటగదిలో ఉన్న పాత్రలతో కొట్టడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. దీనికి ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ఆండ్రియా తెలిపారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచామని తెలిపారు.
దర్యాప్తులో భాగంగా సీఆర్పీసీ సెక్షన్ 41A కింద వినోద్ కాంబ్లీకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు బాంద్రాలోని కాంబ్లీ ఇంటికి చేరుకున్నారు. అంతే కాకుండా సమగ్ర దర్యాప్తులో భాగంగా త్వరలో ఆయన స్టేషన్‌కు వచ్చి తన వాంగ్మూలాన్ని ఇవ్వాలని అన్నారు.