Shikhar Dhawan Asia Cup 2023 : ఎడమ చేతి వాటం బ్యాటింగ్‌తో అద్భుతమైన షాట్లు.. ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డు.. క్యాచ్ పట్టగానే మైదానంలో తొడగొట్టడం.. ఇలా చెప్పగానే మనకు ఇట్టే గుర్తుకొచ్చేది ఒక్కడే ఒక్కడు. అతడే టీమ్ఇండియా బ్యాటర్ శిఖర్ ధావన్. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో తిరుగులేని రికార్డులను తన ఖాతాలోకి వేసుకున్న ఈ స్టార్ ప్లేయర్.. అప్పటి ఆటగాళ్ల నుంచి ఇప్పటి యంగ్‌స్టార్స్ వరకు అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచాడు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం ఈ సీనియర్ భారత బ్యాటర్ కెరీర్‌పై అభిమానుల్లో ఎన్నో ప్రశలు మొదలయ్యాయి.
ఇక ఇతడి కెరీర్ ముగిసే దిశగా సాగుతుందా? లేదా అతడిని ఇక టీమ్‌ఇండియా జెర్సీలో చూడడం కష్టమేనా? క్రికెట్ వర్గాల్లో గబ్బర్ అని పిలుచుకునే ఇక అతని ఆట గతమేనా? అంటూ నెట్టింట అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే వీటన్నింటికీ.. అవును అనే సమాధానామే వినిపిస్తోంది. తాజాగా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత వన్డే జట్టులో ధావన్‌కు చోటు దక్కకపోవడమే ఈ జవాబుకు కారణం. అంతే కాకుండా ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌నకు జట్టు కోసం ఈ ఆసియా కప్‌లో ఆడే భారత జట్టు నుంచే ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల స్టార్ బ్యాటర్‌కు టీమ్ఇండియాలో తిరిగి చోటు దక్కడం కష్టమేనంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అరంగేట్రంతోనే అదుర్స్..
Dhawan International Career : అందరిలానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధావన్.. అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే తన దైన శైలిలో ఆడి అందరి చేత ఔరా అనిపించాడు. 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో.. 2011లో టీ20ల్లో, 2013లో టెస్టుల్లో అడుగులు వేశాడు. ఇక 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన టెస్టు శతకం చేసిన అరంగేట్ర ఆటగాడిగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు (187) నమోదు చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు.
మరోవైపు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేల్లో శతకాలు సాధించాడు. కానీ ఇప్పుడు అతడి ఫామ్‌లో తడబడటం వల్ల.. పరుగుల వేటలో విఫలమవుతున్నాడు. దీంతో తన 13 ఏళ్ల అంతర్జాతీయ ప్రస్థానానికి ఇక స్వస్తి పలికే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాడు.
ఇక టెస్టుల్లో ధావన్ నిలదొక్కుకోలేకపోయాడు. 2018లోనే చివరి టెస్టు ఆడేశాడు. అంతే కాకుండా 2021లోనే చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు. నిరుడు డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడినప్పటికీ మునుపటి లయను అందుకోలేకపోయాడు. పరుగులు చేయడంలోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో భారత్‌కు ఆడిన గత 10 వన్డే ఇన్నింగ్స్‌లోనూ ఆరుసార్లు రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయాడు.
అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కెప్టెన్‌గా 11 మ్యాచ్‌ల్లో 373 పరుగులతో చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేసినప్పటికీ.. టీమ్ఇండియా జట్టులోకి రాలేకపోయాడు. గాయాలు, కుటుంబ సమస్యలు అతణ్ని వెనక్కి లాగాయి.
తీవ్రమైన పోటీ..
Shikhar Dhawan Team India : మరోవైపు టీమ్‌ఇండియాలో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ధావన్‌ను జట్టులోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక ఓపెనర్లుగా రోహిత్, శుభ్‌మన్ కొనసాగుతున్నారు. వీళ్లకు ప్రత్యామ్నాయంగా ఇషాన్ కిషన్ ఉన్నాడు. దీంతో జట్టులో ధావన్‌కు చోటు లేకుండా పోయింది. అంతే కాకుండా టీ20ల్లో ఎలాగో కుర్రాళ్లకు బీసీసీఐ పెద్ద పీట వేస్తోంది. దీంతో వన్డేల్లోకి తిరిగి రావాలనుకున్న ధావన్‌కు నిరాశే ఎదురైంది.
ఇక ఈ ఏడాది ఆసియా క్రీడల్లో పోటీపడే సెకెండ్ క్లాస్ జట్టులోనూ ధావన్‌కు చోటు దక్కలేదు. దీంతో ధావన్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఆసియా కప్ జట్టులోనూ అతడిని విస్మరించారు. అయినప్పటికీ తిరిగి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తానంటూ ధావన్ చెప్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పరిస్థితులు లేవనే చెప్పాలి. ధావన్ 167 వన్డేల్లో 44.11 సగటుతో 6793 పరుగులు, 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2315 పరుగులు, 68 టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 24 శతకాలు అందుకున్నాడు.
Ajit Agarkar Team Selection : 'అందుకే చాహల్‌ను తప్పించాం.. ధావన్ మంచి ప్లేయరే కానీ'
Shikhar Dhawan Odi Career : ఇవి ధావన్ రికార్డ్స్ రేంజ్.. అయినా జట్టులోకి నో ఎంట్రీ!