Shardul Thakur Vs South Africa 2 test: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు (7/61) నమోదు చేశానని భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. అయితే, ఇంతకంటే మెరుగైన ప్రదర్శన చేసే సత్తా తనలో ఉందని పేర్కొన్నాడు. జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేయడంలో శార్దూల్ కీలకంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
"నా టెస్టు కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. కానీ, ఇంత కంటే మెరుగ్గా రాణించే సత్తా ఉంది. తొలి టెస్టు జరిగిన సెంచూరియన్‌లో, రెండో టెస్టు జరుగుతోన్న జొహన్నెస్‌బర్గ్‌లోనూ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. దీంతో సరైన లెంగ్త్‌లో బంతులేస్తూ వికెట్లు పడగొట్టాను. సీనియర్ బౌలర్లు బుమ్రా, మహమ్మద్ షమి కూడా వికెట్ల కోసం శాయశక్తులా శ్రమించారు. ప్రస్తుతం మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ పిచ్‌పై చివరి రెండు రోజులు బ్యాటింగ్ చేయడం సులభం కాదు. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో సఫారీల ముందు వీలైనంత భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటున్నాం" అని శార్దూల్ అన్నాడు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 229 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం ఛెతేశ్వర్ పుజారా (35), అజింక్య రహానె (11) క్రీజులో కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి: Nz vs Bangladesh: బంగ్లా చారిత్రక విజయం.. కివీస్ గడ్డపై ఇదే తొలిసారి