శార్దూల్ ఠాకూర్.. ఇప్పటివరకు ఆడింది నాలుగు టెస్టులే అయినా టీమ్‌ఇండియాలో (Shardul Thakur News) తనదైన ముద్ర వేశాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో (IPL 2021) కీలక పేసర్లకు దీటుగా బౌలింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టుకు (T20 World Cup 2021 India Squad) తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్‌కు ముందే బీసీసీఐ సెలక్టర్లు భారత జట్టులోని 15 మంది సభ్యుల్లో అక్షర్‌పటేల్‌ను స్టాండ్‌బై ఆటగాడిగా మార్చి ఆ స్థానంలో శార్దూల్‌ను ఇటీవలే ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్ (Shardul Thakur IPL 2021) ఫైనల్‌లో కోల్‌కతాపై చెలరేగి మూడు ప్రధాన వికెట్లు తీసి.. చెన్నై ట్రోఫీ అందుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. శార్దూల్ చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నా ఇటీవలి కాలంలో అతడిలోని అత్యుత్తమ ఆటగాడిని బయటపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు రాణించిన పలు కీలక మ్యాచ్‌ల విశేషాలు తెలుసుకుందాం.
అరంగేట్రంలోనే ఎదురుదెబ్బ..
శార్దూల్ 2016లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైనా 2017 ఆగస్టులో శ్రీలంకతో వన్డే కెరీర్ ప్రారంభించాడు. మరుసటి ఏడాది టీ20, టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి అనుకోని పరిస్థితుల్లో మూడేళ్లు జట్టుకు దూరమయ్యాడు. 2018 అక్టోబర్‌లో హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో శార్దూల్ సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి బరిలోకి దిగాడు. అయితే, విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు పది బంతులు బౌలింగ్ చేయగానే కుడికాలి గజ్జల్లో గాయమైంది. తర్వాత బౌలింగ్ చేయకపోయినా బ్యాటింగ్‌లో ఆఖర్లో వచ్చి నాలుగు పరుగులు (Shardul Thakur Stats) చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లే జట్టును విజయతీరాలకు చేర్చడం వల్ల శార్దూల్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆ గాయం తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా సిరీస్‌తోనే తెరపైకి వచ్చాడు.
ఆస్ట్రేలియాలో ఆహా అనిపించి..
గతేడాది చివర్లో టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు (India Tour of Australia 2020-21 Test) వెళ్లినప్పుడు జనవరిలో బ్రిస్బేన్ వేదికగా జరిగిన గబ్బా టెస్టులో శార్దూల్ తొలిసారి అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో సీనియర్ బౌలర్లు గాయాలబారిన పడటం వల్ల అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే తొలుత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో చెలరేగాడు. తర్వాత బ్యాటింగ్‌లోనూ తనదైన ముద్రవేశాడు. ఏడో వికెట్‌కు వాషింగ్టన్ సుందర్(62)తో కలిసి శార్దూల్(67) శతక భాగస్వామ్యం నిర్మించాడు. దీంతో టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కన్నా వెనుకబడకుండా కాపాడాడు. ఆపై ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి బౌలింగ్‌తో మెరిశాడు. నాలుగు కీలక వికెట్లు తీసి దుమ్మురేపాడు. అలా ఈ నూతన ఆల్‌రౌండర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని చారిత్రక సిరీస్ విజయంలో తన పేరును లిఖించుకున్నాడు.
ఇంగ్లాండ్‌లో ఇరగదీసి..
ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలోనూ (India Tour of England 2021) శార్దూల్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఆడిన రెండు టెస్టుల్లో కీలక వికెట్లు తీయడమే కాకుండా బ్యాట్‌తోనూ పరుగులు సాధించాడు. దీంతో టీమ్‌ఇండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలవడంలోనూ తనవంతు కృషి చేశాడు. తొలి టెస్టులో బంతితో మెరిసిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. అలాగే నాలుగో టెస్టు విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ మొత్తం విఫలమైనా శార్దూల్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో (60) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్(50)తో కలిసి ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. ఆపై ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి అసలు సిసలైన ఆల్‌రౌండర్‌గా మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు.
యూఏఈలో మ్యాచ్‌లు మలుపుతిప్పి..
ఇక ఇటీవలే జరిగిన ఐపీఎల్‌లోనూ (IPL 2021) ఈ చెన్నై ఆల్‌రౌండర్ పలు మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపుతిప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీకి అండగా నిలిచాడు. బెంగళూరుతో (CSK Vs RCB 2021) జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), పడిక్కల్ (70) శుభారంభం చేసి జోరుమీదున్నారు. తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించారు. కోహ్లీ ఔటయ్యాక బెంగళూరు స్కోర్ 140 పరుగుల వద్ద శార్దూల్ ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీశాడు. తొలుత ఏబీ డివిలియర్స్ (12)ను పెవిలియన్ పంపిన అతడు తర్వాత పడిక్కల్‌ను సైతం ఔట్ చేశాడు. ఆపై ఇతర బ్యాట్స్‌మెన్ తేలిపోవడం వల్ల కోహ్లీసేన 156/6 పరుగులకే పరిమితమైంది. అనంతరం చెన్నై లక్ష్యాన్ని పూర్తి చేసి విజయం సాధించింది.
- అనంతరం దిల్లీతో (CSK Vs DC 2021) జరిగిన మ్యాచ్‌లోనూ ఠాకూర్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 136/5 స్వల్ప స్కోర్ నమోదు చేసినా దిల్లీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని పూర్తి చేసింది. తొలుత ఆ జట్టు తేలిగ్గానే గెలుస్తుందని అనిపించినా 15వ ఓవర్‌లో బౌలింగ్ చేసిన శార్దూల్ రెండు వికెట్లు తీశాడు. దీంతో చెన్నైని తిరిగి పోటీలోకి తీసుకొచ్చాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న ధావన్ (39), రవిచంద్రన్ అశ్విన్ (2)ను పెవిలియన్ పంపాడు. అయితే, చివర్లో హెట్‌మైయర్ (28), రబాడ (4) నాటౌట్‌గా నిలిచి దిల్లీని గెలిపించారు.
- తర్వాత పంజాబ్‌తో (CSK Vs PBKS 2021) జరిగిన మ్యాచ్‌లోనూ శార్దూల్ ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లోనూ చెన్నై తొలుత 134/6 తక్కువ స్కోరే సాధించింది. కేఎల్ రాహుల్ (98 నాటౌట్) దంచి కొట్టడం వల్ల పంజాబ్ గెలిచింది. కానీ, అంతకుముందు ఐదో ఓవర్ వేసిన శార్దూల్ మయాంక్ అగర్వాల్ (12), సర్ఫరాజ్ ఖాన్ (0)ను ఔట్ చేసి జట్టులో పోరాడేతత్వాన్ని రగిలించాడు.
- చివరగా ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా (CSK Vs KKR FINAL) ఓటమిపాలవ్వడానికి ప్రధాన కారణం శార్దూలే అనే చెప్పాలి. ఎందుకంటే చెన్నై 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) అర్ధశతకాలతో రాణించి సగంపని పూర్తి చేశారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. సరిగ్గా ఇక్కడే శార్దూల్ మరోసారి మాయ చేశాడు. 11వ ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్‌తో పాటు నితీశ్ రాణా(0)ను పెవిలియన్ చేర్చి తిరిగి చెన్నైని పోటీలోకి తెచ్చాడు. ఆపై కోల్‌కతా బ్యాట్స్‌మెన్ తేలిపోవడంతో చెన్నై నాలుగోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
మంచి అవకాశం..
శార్దూల్ ఇలాగే రాణిస్తే (Shardul Thakur Performance) జట్టులో ప్రధాన ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆ పాత్ర పోషించిన హార్దిక్ పాండ్య ప్రస్తుతం పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అతడు ప్రపంచకప్‌లోనూ (T20 World Cup 2021) బౌలింగ్ చేసే అవకాశాలు లేనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో తుదిజట్టులో అవకాశం వచ్చి శార్దూల్ మరోసారి మెరిస్తే ఇక అన్ని ఫార్మాట్లలోనూ సుస్థిర స్థానం సంపాదించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏదైమైనా శార్దూల్ ఈ ఏడాది కీలక ఆటగాడిగా ఎదిగాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదీ చూడండి: Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ రికార్డు.. కపిల్‌దేవ్ సరసన చోటు