Shakib al hasan ipl team : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉండే ప్రత్యేకతే వేరు. ఇందులో ఆడితే కాసుల వర్షమే. అలాంటి ఈ రిచ్ క్యాష్ లీగ్‌లో ఆడాలని ప్రపంచంలోని దాదాపు ప్రతీ క్రికెటర్ ఆశపడుతుంటారు. ఈ మెగాలీగ్ ద్వారా తన టాలెంట్‌ను బయటపెట్టి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. ఇంకా చెప్పాలంటే పలు సందర్భాల్లో జాతీయ జట్టు కున్నా ఈ ఐపీఎల్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఆడిన ప్లేయర్లు ఉన్నారు.
అయితే బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ప్లేయర్లు మాత్రం అలా చేయలేదు. ఐపీఎల్ కన్నా తమ జాతీయ జట్టే తమకు ఎక్కువ అనుకున్నారు. అలా నేషనల్ టీమ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఐపీఎల్ ఆఫర్లను వదులుకున్నారు. వారే షకీబ్ అల్‌హసన్, లిటన్ దాస్, తస్కిన్ అహ్మద్. అలా చేసినందుకు తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డు వారిని ప్రశంసించింది. ఓ రివార్డు కూడా ప్రకటించింది. ఆ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లను(దాదాపు 53 లక్షలు) బీసీబీ నగదు ఇవ్వనుంది.
ఇకపోతే ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను.. కోల్‌కతా నైట్‌రైడర్స్ బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్ కారణంగా.. అతడు ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. లిటన్ దాస్ కూడా ఇదే చేశాడు. ఐర్లాండ్ సిరీస్ కారణంగా ఈ ఏడాది సీజన్ తొలి దశలో భాగం అవ్వలేదు. ఆ తర్వాత రెండో దశలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడిని రూ.50 లక్షలకు కోల్‌కతా జట్టే దక్కించుకుంది. ఇక గాయం కారణంగా ఐపీఎల్ రెండో దశకు దూరమైన లఖ్‌నవూ ఫాస్ట్ బౌలర్ స్థానంలో తస్కిన్ అహ్మద్‌కు అవకాశం వచ్చింది. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఆడొద్దని సూచించిందట. దీంతో తస్కిన్ అహ్మద్ కూడా ఐపీఎల్ అవకాశాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ఇంకా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకుని పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ ఐపీఎల్ సీజన్లో ఆడలేదు.
ఇదీ చూడండి :
ఆ స్టార్ ప్లేయర్స్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు మాస్టర్ ప్లాన్!