Ranji Trophy Sarfaraj Khan: రంజీ ట్రోఫీలో ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీ సాధించాడు సర్ఫరాజ్. రంజీల్లో అతడికిది ఏడో సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్‌కు ముందు జరిగిన లీగ్ స్టేజ్‌లోనూ టాప్ ఫామ్‌లో ఉన్న అతడు.. ఇప్పుడు నాకౌట్ దశలోనూ దంచికొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 153 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లోనే 704 పరుగులు చేశాడు సర్ఫరాజ్.
2019-20 సీజన్ నుంచి సర్ఫరాజ్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లోనే అతడు ఏకంగా 928 పరుగులు తీశాడు. అందులో ఒక ట్రిపుల్ సెంచరీ(301*) కూడా ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ (సగటు 95.14) తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సగటు సర్ఫరాజ్‌దే (80.42). అంటే అతడు ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ విజయ్ మర్చంట్‌ను (71.64) అతడు అధిగమించాడు. అయితే ఈ స్థాయిలో పరుగులు చేస్తున్నా ఇప్పటి వరకు టీమ్ఇండియా నుంచి మాత్రం అతడికి ఎలాంటి పిలుపురాలేదు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడ్ని వేలంలో కొనుగోలు చేసినా కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే ఆడటానికి అవకాశం ఇచ్చింది.
ఇవీ చదవండి: 'ధోనీ ఆ విషయాన్ని నాకు అర్థమయ్యేలా చేశాడు'