Arjun Tendulkar Deodhar Trophy : ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీ సౌత్ జోన్ జట్టులో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్‌కు స్థానం దక్కింది. ఈ టోర్నీలో భాగంగా సౌత్ జోన్ టీమ్‌కు అర్జున్ ఎంపికయ్యాడు. దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్ జోన్ జట్టులో ఆడే ఆటగాళ్ల పేర్లను తాజాగా ప్రకటించారు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మొత్తం 15 మంది ప్లేయర్స్‌తో కూడిన సౌత్ జోన్ జట్టును ప్రకటించిన జాబితాలో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రికీ భుయ్‌లు కూడా ఉన్నారు. ఈ జట్టు సారథ్య బాధ్యతలను మయాంక్ అగర్వాల్‌కు అప్పగించగా.. రోహన్ కున్నుమ్మల్‌ను డిప్యూటీగా ఎంపిక చేశారు. జూలై 24 నుంచి పుదుచ్చేరి వేదికగా దేవ్‌ధర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆగస్టు 3 వరకు ఈ టోర్నీ కొనసాగుతుంది.
సౌత్ జోన్ టీమిదే..
Deodhar Trophy South Zone : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), రికీ భుయ్ (వికెట్ కీపర్), అర్జున్ తెందుల్కర్, రోహిత్ రాయుడు, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, కేబీ అరుణ్ కార్తీక్, వి కావేరప్ప, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, ఆర్ సాయి కిషోర్, విజయ్ కుమార్ వైశాఖ్.
Arjun Tendulkar IPL 2023 : ఐపీఎల్ సీజన్-16లో ముంబయి ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అర్జున్ తెందుల్కర్. కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టులో లేకపోయినప్పటికీ.. నెట్స్‌లో మాత్రం తీవ్రంగా శ్రమించాడు. ఇక ఈ ఐపీఎల్-2023లో ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు.
ఐపీఎల్‌లో తొలి వికెట్..
ఏప్రిల్‌లో జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ముంబయి నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించలేకపోయింది. 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబయి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసిన అర్జున్ తెందుల్కర్ తొలి వికెట్ తీశాడు. 19.5 ఓవర్ల వద్ద హైదరాబాద్ ఆటగాడు భువనేశ్వర్‌ను ఔట్ చేసి ఐపీఎల్‌లో బోణీ చేశాడు.
ఇంకా రాటుతేలాలి..
అర్జున్ కెరీర్ తగినంత డ్రామాతో మొదలైంది. గత డిసెంబర్‌లో గోవా తరఫున ఆడుతూ సెంచరీతో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను మొదలు పెట్టాడు అర్జున్. ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు డగౌట్‌లో కూర్చొని ఈ ఏడాదే అరంగేట్రం చేశాడు. 23 ఏళ్ల ఎడమచేతి వాటం మీడియం పేసర్ అయిన అర్జున్ తెందూల్కర్ జాతీయ స్థాయిలో ఇంకా వేగవంతమైన, ఆసక్తి రేపే బౌలర్‌గా మారాలంటే ఇంకా రాటుతేలాలి.