Sachin Kohli: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు కిక్రెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్. కోహ్లీ తన కెరీర్ రూపుదిద్దుకున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. విరాట్ తన ఆటను మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడ్డాడని సచిన్ చెప్పుకొచ్చాడు.
'విరాట్ నాకు మంచి స్నేహితుడు. గత దశాబ్దకాలంగా అతని కెరీర్ రూపుదిద్దుకున్న తీరు పట్ల సంతోషంగా ఉన్నా. అతను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయానికి.. నేను జట్టులో సభ్యుడిగా ఉన్నా. అప్పుడు కోహ్లీలో ఒకవిధమైన ఫైర్ చూశాను. అక్కడి నుంచి తన ఆటను మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అందుకు తగిన విధంగా తన జీవనశైలిని మార్చుకున్నాడు. అదే అతడి లక్ష్యాలు సాధించడానికి దోహదపడింది" అని సచిన్ పేర్కొన్నాడు.
గతంలో విరాట్ కోహ్లీని కలిసిన విషయాన్ని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో విరాట్.. తన సాయం కోరాడని సచిన్ తెలిపాడు. తన ఆట తీరులో లోటుపాట్లు గురించి చర్చించినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లతో తనకు తెలిసిన విషయాలను పంచుకోవడంలో తానెప్పడూ ముందుంటానని చెప్పాడు.
"2014లో నేను అతనిని కలిసినట్లు గుర్తుంది. అప్పుడు విరాట్ నా సాయం కోరాడు. బ్యాటింగ్‌లో లోటుపాట్లు గురించి చర్చించేందుకు తనకు సమయం కేటాయించమని రిక్వెస్ట్ చేశాడు. ఆ సమయంలోనే అతను మెరుగుపడాలని కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం" అని సచిన్ పేర్కొన్నాడు.
కాగా విరాట్ గత కొద్ది కాలంగా ఫామ్ కోల్పోయి రాణించలేకపోతున్నాడు. అతడు సెంచరీ సాధించి రెండేళ్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లీ మునుపటి ఫామ్‌ను అందుకోనేందుకు ఓ సారి సచిన్ కలవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: IPL 2022: ఐపీఎల్‌కు డేట్ ఫిక్స్- నాలుగు వేదికల్లో 70 మ్యాచ్‌లు!