SA vs India Cricket Tickets: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో తలపడేందుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న దృష్ట్యా.. ఈ సిరీస్ నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య జరగబోయే ఈ సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.
"కరోనా కారణంగా సిరీస్ ఆగిపోకూడదని ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరపాలని నిర్ణయం తీసుకున్నాము. సూపర్ స్పోర్ట్, ఎస్ఏబీసీ ప్లాట్ఫామ్లో బ్రాడ్కాస్ట్ కొనసాగుతుందని ప్రేక్షకులకు విన్నవిస్తున్నాము. మ్యాచ్ కారణంగా క్రికెట్ అభిమానులకు కరోనా సోకకూడదని భావించాము."
-దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్
India vs SA Cricket Match: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆఫ్రికా గడ్డ మీద ఒక్క సిరీస్‌ను గెలుచుకోని టీమ్‌ఇండియా.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.