IPL CSK Captain Ruturaj gaikwad: చెన్నై జట్టు సారథి ఎంఎస్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడు.. రుతురాజ్ గైక్వాడ్ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. మహీలా సుదీర్ఘకాలంపాటు నాయకత్వ బాధ్యతలను నిర్వహించగలిగే సత్తా కూడా అతనిలో ఉందని అన్నాడు. గత సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి.. ప్రస్తుత సీజన్ ఆరంభంలో కాస్త తడబాటుకు గురై.. ఇప్పుడు కుదురుకుని రాణిస్తున్నాడు రుతురాజ్. ఈ సీజన్ మొదట్లో ధోనీ కెప్టెన్సీని వదులుకొని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే వ్యక్తిగతంగా విఫలం చెందడంతోపాటు చెన్నై వరుస పరాజయాల నేపథ్యంలో మరోసారి జట్టు పగ్గాలను మహీ అందుకున్నాడు. అయితే వచ్చే సీజన్‌లో ధోనీ కొనసాగుతాడా..? కెప్టెన్సీని నిర్వహిస్తాడా..? సారథ్యం చేయకపోతే ఎవరిని చెన్నైకి కొత్త కెప్టెన్‌గా నియమిస్తారు.. వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ధోనీ కొనసాగకపోతే మాత్రం రుతురాజ్ సరైన ఎంపికగా నిలుస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
"ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు రుతురాజ్ కెప్టెన్సీ చేశాడు. చాలా నిశ్శబ్దంగా తనపని చేసుకుపోతాడు. బ్యాటింగ్‌లో సెంచరీ కొట్టినా.. లేకపోతే డకౌట్‌గా వెనుదిరిగినా ఎలాంటి భావోద్వేగం కనిపించనీయడు. అతడి ప్రవర్తనలోనూ మార్పు ఉండదు. అందుకే చెబుతున్నా చెన్నై జట్టు సారథ్యానికి రుతురాజ్ అర్హుడు. గేమ్‌ను ఎలా నియంత్రించాలో బాగా తెలుసు. ఇప్పుడు రుతురాజ్ వయస్సు కూడా చాలా తక్కువే. కాబట్టి చెన్నై తరఫున కనీసం నాలుగైదు సీజన్లు ఆడగలడు. ధోనీలా సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా రుతురాజ్ రాణిస్తాడు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. తుది నిర్ణయం తీసుకునేది చెన్నై యాజమాన్యమే కదా" అని సెహ్వాగ్ వివరించాడు.
మహీ కెప్టెన్సీలో ఎక్కువగా విజయవంతం కావడానికిగల కారణాలను కూడా సెహ్వాగ్ విశ్లేషించాడు. "ధోనీ చాలా కూల్. స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలడు. అంతేకాకుండా అదృష్టం అతడి వెంటే ఉంది. అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగే వారితోనే లక్ ఉంటుందనేది నానుడి. అలానే రతురాజ్‌లోనూ ఇలాంటి గుణాలే ఉన్నాయి" అని పేర్కొన్నాడు. మరోవైపు సెహ్వాగ్ విశ్లేషణకు మరో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా మద్దతుగా నిలిచాడు. "రాబిన్, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో వంటి సీనియర్లు మరింత కాలం ఆడలేరు. ఇప్పటికే రవీంద్ర జడేజాను ప్రయత్నించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే వీరేంద్ర సెహ్వాగ్ చెప్పినట్లు రుతురాజ్‌కు నా మద్దతు తెలుపుతున్నా" అని జడేజా వివరించాడు.
ఇదీ చూడండి: కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్ మృతి