Rohith Teamindia full time captaincy: భారత క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో పూర్తి స్థాయి కెప్టెన్ వచ్చేశాడు. అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పజెప్పారు. దీంతో ధోని, కోహ్లిల తర్వాత కెప్టెన్‌గా త్రిపాత్రాభినయం చేసేందుకు అతను సిద్ధమయ్యాడు. మూడు ఫార్మట్లలోనూ కెప్టెన్లుగా వ్యవహరించిన ధోని, కోహ్లి జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా చూడకుండా వీళ్లు దాన్ని ఆస్వాదించారు. కోహ్లి సారథ్యం చేపట్టాక అతని బ్యాటింగ్ మరో స్థాయికి చేరింది. రోహిత్ కూడా అదే బాటలో సాగాల్సిన అవసరం ఉంది. వాళ్లిద్దరితో పోలిస్తే రోహిత్‌కు ఆలస్యంగా నాయకత్వ బాధ్యతలు దక్కాయి. 34 ఏళ్ల అతనికి ఫిట్‌నెస్ సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ సమయంలో అనుకోని వరంలా అతనికి మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ లభించింది. అయితే ఇది భారం కాకుండా చూసుకోవడం రోహిత్‌కు సవాలే. ముఖ్యంగా టెస్టు సారథ్యం అతడికి తేలిక కాదు. విదేశీ టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. స్వదేశీ పిచ్‌లపై చెలరేగి ఆడే రోహిత్.. ఉపఖండం ఆవల, ఫాస్ట్ పిచ్‌లపై విఫలమవుతున్నాడనే ముద్ర ఉంది. దాన్ని చెరిపేసుకునే దిశగా ఇటీవల అతని ప్రదర్శన మెరుగవుతోంది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్‌గా అతను.. మరింత ఉత్తమ ఆటతీరుతో సహచరుల్లో స్ఫూర్తి నింపాల్సి ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు అయిదు టైటిళ్లు అందించిన సారథిగా.. అతని నాయకత్వ లక్షణాలపై ఎలాంటి అనుమానాల్లేవు. టీమ్‌ఇండియా కెప్టెన్‌గానూ కొత్త ప్రయాణం మెరుగ్గా మొదలైంది. కానీ రాబోయే రోజులు అతనికి సవాలు విసరనున్నాయి. ముఖ్యంగా వరుసగా ప్రపంచకప్‌లు ఉన్నాయి. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విశ్వవిజే తగా నిలపాల్సిన బాధ్యత అతనిపై ఉంది.
ద్రవిడ్ రిటైర్మెంట్ అవ్వమన్నాడు
"ఇకపై జట్టు ఎంపికలో నన్ను పరిగణలోకి తీసుకోబోమని టీమ్ మేనేజ్మెంట్ ముందే చెప్పేసింది. రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని కోచ్ ద్రవిడ్ నాకు సూచించాడు. గతేడాది న్యూజిలాండ్‌తో గాయంతో ఇబ్బంది పడుతూనే 61 పరుగులతో అజేయంగా నిలిచాను. అప్పుడు సౌరభ్ నాకు వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం దేని గురించి ఆలోచించాల్సిన పని లేదన్నాడు. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ ఇంత వేగంగా పరిస్థితులు ఎలా మారిపోయాయో నాకర్థం కావట్లేదు." అని సాహా అన్నాడు.
ఇదీ చూడండి: పుజారా, రహానె, సాహా, ఇషాంత్.. మళ్లీ వస్తారా?