Rohit sharma news: ఇటీవల కరోనా బారిన పడిన టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైరస్ నుంచి కోలుకున్నాడు. ఇప్పటికే పరీక్షల్లో నెగటివ్ రాగా ఆదివారంతో రోహిత్‌కు క్వారంటైన్ పూర్తయింది. ఈ నేపథ్యంలో రోహిత్ ఈనెల 7 నుంచి జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ విషయాన్ని బీసీసీఐ నిర్ధరించింది. రోహిత్ పూర్తిగా కోలుకున్నాడని అయితే టీ20 సిరీస్ ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.
ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ పూర్తయ్యాక టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 7, 9, 10 తేదీల్లో టీ20లు జరగనుండగా.. 12, 14, 17 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అందుకోసం భారత జట్టు సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను ప్రకటించింది.
అయితే, టీ20 సిరీస్‌కు ప్రత్యేకంగా రెండు బృందాలను ఎంపిక చేయడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టుకు, తొలి టీ20 మధ్య ఎక్కువ సమయం లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడిన జట్టే ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో బరిలోకి దిగనుంది. ఇక రెండో టీ20 నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్ సింగ్.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.
ఇదీ చూడండి : నయా 'వీరు'డు పంత్ రికార్డుల మోత.. దిగ్గజాలను సైతం వెనక్కినెట్టి..