Rohit Sharma ODI Captain Challenges: టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది సెలెక్షన్ కమిటీ. ఇకపై పరిమిత ఓవర్లకు రోహిత్, టెస్టు జట్టుకు కోహ్లీ పగ్గాలు చేపట్టనున్నారు. అయితే కొత్తగా వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికైన హిట్‌మ్యాన్ ముందు అనేక సవాళ్లున్నాయి. ఇందులో ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలిచేందుకు సరైన జట్టు ఎంపిక చేయడమే అతడి ముందున్న అతిపెద్ద సవాల్. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్‌గా రోహిత్ ఎదుర్కోబోయే సవాళ్లేంటో చూద్దాం.
యువకులు, అనుభవజ్ఞుల కలయిక
ఏ జట్టులోనైనా యువ ఆటగాళ్లకు తోడు కాస్తంత అనుభవం కూడా వారికి మద్దతుగా ఉండాలి. ప్రస్తుతం టీమ్ఇండియాలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ చాహర్, సైనీలాంటి ఆటగాళ్లకు వరుస అవకాశాలు కల్పిస్తూ వారిని ప్రపంచకప్ టోర్నీలకు సిద్ధం చేయాల్సి ఉంది. అలాగే సరైన ఆల్రౌండర్నూ ఎంపిక చేయాల్సి ఉంటుంది. యూఏఈలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని వచ్చే మెగాటోర్నీలో సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదంతా జరగాలంటే రోహిత్ ముందుగా సరైన ఆటగాళ్లతో ఓ అత్యుత్తమ జట్టును సిద్ధం చేయాల్సి ఉంటుంది.
కోహ్లీ ఫామ్
Virat Kohli Current Form: ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ అభిమానుల్ని తీవ్రంగా కలవరపెడుతోంది. రెండేళ్లుగా ఇతడు తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. దీంతో ఇతడి కెప్టెన్నీపైనా వేటు పడింది. ఇకనైనా స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇతడు జట్టులో సీనియర్ ఆటగాడిగా కొనసాగుతూ, యువకులకు మద్దతుగా నిలుస్తూ.. తన బ్యాటింగ్‌పై దృష్టిసారించాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ కూడా కోహ్లీ మెంటార్షిప్ జట్టుకు ఎంతో అవసరమని నమ్ముతున్నాడు.
ఆ తప్పులు వద్దు
2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా పరాజయానికి ముఖ్య కారణం సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోవడం. వారి స్థానాల్లో వారు సరైన ప్రదర్శన చేయలేకపోవడం. ఇప్పటికీ జట్టు మిడిలార్డర్లో సరైన కూర్పు లేదు. ఇప్పటివరకు చాలామంది ఈ స్థానాల కోసం ఎంపికైనా.. వారికి సరైన అవకాశాలు కల్పించడం లేదు. ఒక్కో సిరీస్‌కు ఒక్కో ఆటగాడిని మారుస్తున్నారు. 2019 ప్రపంచకప్ ముందు నాలుగో స్థానంలో రాయుడు సరైన ఆటగాడని కోహ్లీ స్పష్టం చేసినా.. అనూహ్యంగా ఈ టోర్నీకి అతడిని ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. త్రీడీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌కు అవకాశం కల్పించారు. కానీ ఈ టోర్నీలో ఇతడు దారుణంగా విఫలమయ్యాడు. తర్వాత విజయ్‌కు గాయమైందని సెమీ ఫైనల్లో పంత్‌ను 4లో, దినేశ్ కార్తీక్‌నూ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపారు. ఇలా మెగాటోర్నీ నాకౌట్ స్టేజ్‌లో మార్పులు చేయడం పట్ల చాలామంది కోహ్లీతో పాటు రవిశాస్త్రిపై విమర్శలు కురిపించారు. ఇదే టీమ్ఇండియా ఓటమి కారణమని మండిపడ్డారు. తాజాగా వచ్చే ప్రపంచకప్‌లో రోహిత్ ఇలాంటి తప్పులు చేయకూడని వారు భావిస్తున్నారు. అందుకోసమే ప్రపంచకప్‌లోగా సరైన జట్టును ఎంపిక చేస్తే బాగుంటుందని అభిమానులతో పాటు మాజీలు అభిప్రాయపడుతున్నారు.