Roger Binny BCCI President: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ.. సవాళ్లను ఎదుర్కోవడం చాలా ఇష్టమని పేర్కొన్నాడు. టాప్ పొజిషన్ తీసుకోవడానికి తానేమీ కంగారు పడలేదని తెలిపాడు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయాలని కబురు వచ్చినప్పుడు కాస్త షాక్‌కు గురైనట్లు వెల్లడించాడు. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న గంగూలీకి మరోసారి అవకాశం ఇస్తారని అంతా భావించినా జరగలేదు. అయితే బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జయ్ షా మరోమారు ఆ పదవిలోనే కొనసాగుతారు.
"నామినేషన్ వేయాలని నన్ను అడిగినప్పుడు షాక్‌కు గురయ్యా. బీసీసీఐలో ఏదో ఒక పోస్టు కోసం పోటీ చేయాలని అడుగుతున్నారేమో అనుకొన్నా. అయితే అధ్యక్ష పదవి అనుకోలేదు. నేను ప్రెసిడెంట్ అయినట్లు అనుకోవడానికకి ఆ రోజు రాత్రంతా పట్టింది. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా ఆనందంగానే బాధ్యతలు నిర్వర్తిస్తానని భావిస్తున్నా" అని రోజర్ బిన్నీ తెలిపారు. టీమ్‌ఇండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను నెగ్గిన జట్టులో రోజర్ బిన్నీ కీలక సభ్యుడు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి జాతీయ సెలెక్టర్‌గా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టారు.