Rishabh pant news: టీమ్‌ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డపై 72 ఏళ్ల పాత రికార్డును బద్దలుకొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో (146, 57) కలిపి మొత్తం 203 పరుగులు చేశాడు. దీంతో 1950లో వెస్టిండీస్ ఆటగాడు క్లైడ్ వాల్‌కాట్ రికార్డును బద్దలుకొట్టాడు. అప్పుడు లార్డ్స్ వేదికగా విండీస్.. ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ విండీస్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వాల్‌కాట్ (14, 168) రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 172 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌లో పర్యటించిన జట్లలోని వికెట్ కీపర్లలో వాల్‌కాట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు పంత్ అదే రికార్డును బద్దలుకొట్టాడు.
టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 36 పరుగులు చేరగానే ఆ రికార్డును అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి సొంతమైన మరో రికార్డును సైతం తన పేరిట లిఖించుకున్నాడు. ధోనీ 2011లో ఇదే బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన టెస్టులో (77, 74 నాటౌట్) మొత్తం 151 పరుగులు చేశాడు. ఇప్పుడు దాన్ని కూడా పంత్ అధిగమించాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టుపై ఒకే టెస్టులో శతకం, అర్ధ శతకం బాదిన రెండో వికెట్ కీపర్‌గానూ నిలిచాడు. 1973లో ఫరూక్ ఇంజినీర్ ముంబయి వేదికగా ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టులో (121, 66) పరుగులు చేశాడు. దీంతో ఈ యువ కీపర్, బ్యాట్స్‌మన్ ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు నమోదు చేశాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు