మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వారి ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో సైతం జడేజా ఆడలేకపోవచ్చునని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఇంత తక్కువ సమయంలో అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావడం కష్టమేనని వారు పేర్కొంటున్నారు. అతడికి బదులుగా భీకర ఫామ్‌ను కోనసాగిస్తోన్న సూర్యకుమార్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. "జడేజా శస్త్రచికిత్స అనంతరం ఎన్సీఏలో ఉన్నాడు. ప్రస్తుతానికైతే అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో బంగ్లా పర్యటనలో పాల్గొంటాడనే విషయం చెప్పలేం. ఫిట్‌నెస్‌తో తిరిగొస్తాడనే ఉద్దేశంతోనే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడి పేరును ప్రకటించింది" అని వారు తెలిపారు.
ఒకవేళ జడేజా స్థానంలో మరొక స్పిన్నర్‌ను తీసుకోవాల్సి వస్తే ఇండియా- ఎ జట్టు నుంచి సౌరభ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్ జట్టులో సౌరభ్ ఆడాడు. ఇప్పటికే జట్టులో ఆర్ ఆశ్విన్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లు ఉన్నారు. మరి నాలుగో స్పిన్నర్‌ను ఎంపిక చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. డిసెంబర్ 14- 18 మధ్య చిట్టగాంగ్ వేదికగా రోహిత్ సేన నేతృత్వంలోని జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. అనంతరం మీర్పూర్ వేదికగా 22-26 మధ్య వన్డే సిరీస్‌లో పాల్గొననుంది.
ఇదీ చూడండి: ఆ విషయంలో నేనెప్పుడు భయపడలేదు: శిఖర్ ధావన్