Ravichandran Ashwin Ponting: "ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేదు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఇరగదీశాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనే అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. టీమ్‌ఇండియా విజయాలు సాధించాలంటే విరాట్ ఆడాల్సిందే" అని క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ తాజాగా స్పందించాడు. ఆదివారం జింబాబ్వేతో టీమ్‌ఇండియా గ్రూప్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో అశ్విన్ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు.
"టీ20 ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచుల్లో చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌పై ఇలానే జరిగింది. అయితే టీ20 ఫార్మాట్ అంటేనే మలుపులు సర్వసాధారణం. కచ్చితంగా ఏదొక సమయంలో మార్పు వస్తుందని భావిస్తున్నా. మ్యాచ్‌ను చూసే అభిమానులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పటికీ మ్యాచ్ నుంచి మేం నేర్చుకుంటూనే ఉంటాం. చిన్న మార్జిన్‌తో మ్యాచ్ మారిపోతుంటుంది. గతంలో నిపుణులు, మాజీ క్రికెటర్లతో మాట్లాడిన సందర్భాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్లు. జట్టు సరిగా ఆడలేదని, మంచి ప్రదర్శన ఇవ్వలేదని అనడం సరైందికాదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడాల్సి ఉంటుంది" అని అశ్విన్ తెలిపాడు. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.
ఇప్పుడది లీగల్..
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా నాన్‌స్ట్రైకింగ్‌లోని డేవిడ్ మిల్లర్ కాస్త క్రీజ్ దాటి ముందుకు వచ్చినప్పటికీ అశ్విన్ రనౌట్ చేయలేదు. భారత టీ20 లీగ్‌లో బట్లర్‌ను మన్కడింగ్ చేసినప్పుడు చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు ఇలాంటి రనౌట్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. "నిజం చెప్పాలంటే నాకు ఇలా రనౌట్ కావడం ఇష్టం ఉండదు. నాకే కాకుండా ఇతర బ్యాటర్లకూ ఇష్టం ఉండకపోవచ్చు. అలాగే బంతిని తన్ని ఔట్ కావడం, బౌల్డ్, రనౌట్ మాత్రమే కాకుండా ఎల్బీగా కూడా పెవిలియన్‌కు చేరడం ఇష్టపడను. అయితే ఇప్పుడు నాన్ స్ట్రైకర్ రనౌట్ చట్టబద్ధం. చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత చేశారు. అయితే ఇప్పటికీ కొందరు వివాదాస్పదం చేయడానికి చూస్తేనే ఉంటారు" అని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్ సూపర్ -12 దశలో భారత్ మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకొంది. చివరి మ్యాచ్‌లో ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమ్‌ఇండియా నేరుగా సెమీస్ చేరుకొంటుంది.