Ravi Shastri on IND vs AUS 36 All Out: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డేనైట్ టెస్టులో 36 పరుగులకే టీమ్‌ఇండియా కుప్పకూలడమే తన పదవీకాలంలో అత్యంత దారుణమైన ప్రదర్శన అని భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీవిరమణ చేసిన రవిశాస్త్రి తెలిపాడు. ఈ సంఘటన తామందరిని షాక్‌కు గురి చేసిందని, దాంతో అందరం నిశ్చేష్టులయ్యామని చెప్పాడు. తన పదవీకాలంలో అత్యంత తక్కువస్థాయి ప్రదర్శన అని పేర్కొన్నాడు.
"కోచ్ అనేవాడు ఎప్పుడూ విమర్శలకు సిద్ధంగా ఉండాలి. తప్పించుకునే మార్గాలు ఉండవని తెలుసు. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాం. కనీసం ఇంకో 80 పరుగులు చేస్తే గెలుపు కోసం పోరాడే అవకాశం ఉంది. అయితే కేవలం 36 పరుగులే చేశాం. దీంతో మేం ఒక్కసారిగా షాక్‌తో నిశ్చేష్టులయ్యాం. దీనికి నేనే మొదటి బాధ్యుడినని చెబుతా. తర్వాతి మ్యాచ్‌లకు సంబంధించి ఆటగాళ్లు ఏం చేయగలరో అదే చేయమని చెప్పా. దానిని ఆచరించి సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఎప్పటికీ ఆ సిరీస్ విజయం గురించి క్రికెట్ ప్రేమికులు మాట్లాడుకుంటారని ధీమాగా చెబుతున్నా."
-రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ కోచ్
IND vs AUS 36 All Out: రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా టీమ్‌ఇండియా విదేశాల్లో అపూర్వమైన విజయాలను సాధించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మీద సిరీస్‌లను కైవసం చేసుకుంది. అయితే ఘన చరిత్ర కలిగిన రవిశాస్త్రి పదవీకాలంలో ఆసీస్‌పై ఓ టెస్టు మ్యాచ్ గణాంకాలు మాత్రం మాయనిమచ్చగా మిగిలిపోయింది. అడిలైడ్ వేదికగా గులాబీ బంతి టెస్టులో ఆస్ట్రేలియా మీద కేవలం 36 పరుగులకే టీమ్‌ఇండియా కుప్పకూలిన సంఘటన ప్రతి ఒక్కరికీ గుర్తే ఉండి ఉంటుంది. అత్యల్ప స్కోరు నమోదైన ఆ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం.