Ravi Shastri: టీ20 లీగ్ కారణంగా గొప్ప నైపుణ్యమున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని టీమ్‌ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. కుర్రాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటుతున్నారని ప్రశంసించాడు. వైవిధ్యమైన షాట్లతో అభిమానులను అలరిస్తున్నారని పేర్కొన్నాడు. తన తరంలో ఆటగాళ్లు విభిన్నమైన షాట్లు ఆడితే కోచ్‌లు పిచ్చోడిలా చూసే వారని రవిశాస్త్రి చెప్పాడు.
" ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యువ ఆటగాళ్లు ప్రస్తుత పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతున్నారు. అవకాశం వస్తే.. ఏ ఫార్మాట్లోనైనా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంటున్నారు. పొట్టి ఫార్మాట్ కారణంగా చాలా మంది యువ ఆటగాళ్లు చిన్న వయసులోనే వెలుగులోకి వస్తున్నారు. మూడు ఫార్మాట్లోనూ మెరుగ్గా రాణిస్తున్నారు. వైవిధ్యమైన షాట్లతో అలరిస్తున్నారు. మా తరం ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. స్వీప్, రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లు ఆడితే.. మా కోచ్‌లు పిచ్చోడిలా చూసేవారు"
- రవిశాస్త్రి, టీమిండియా మాజీ హెడ్ కోచ్
బదోనిపై అంచనాలు పెరిగిపోయాయి: 'ఆయుష్ బదోని తన ఆటతీరుతో కట్టి పడేశాడు. సానుకూల స్వభావంతో ఆడుతున్నాడు. ఏ మాత్రం భయం లేకుండా అవలీలగా భారీ షాట్లు బాదేస్తున్నాడు. చకచకా స్ట్రైక్ రొటేట్ చేయగలడు. ఏ బంతిని ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఇప్పటికే అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆయుష్‌కి గొప్ప భవిష్యత్ ఉంది' అని రవిశాస్త్రి అన్నాడు. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచులో ఆయుష్ (54) అర్ధ శతకంతో రాణించాడు. ప్రస్తుత సీజన్ ద్వారా టీ20 మెగా టోర్నీలోకి కొత్తగా అడుగు పెట్టిన లఖ్‌నవూ జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడగా రెండింట్లో విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన ఆరంభ మ్యాచులో పరాజయం పాలైంది.
ఇదీ చూడండి: కోహ్లీపై పాక్ ఫ్యాన్ కామెంట్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఇండియన్!