స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లేమికి కారణం టీమ్ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడమే అని అన్నాడు పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్. 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్‌గా ఉన్న శాస్త్రికి.. భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలిగే అనుభవం లేదని చెప్పాడు. శాస్త్రి కోచ్ కాకపోయి ఉంటే కోహ్లీ ఫామ్ కోల్పోయి ఉండేవాడు కాదని అభిప్రాయపడ్డాడు. రెండేళ్లుగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. 2019 నవంబర్ నుంచి ఏ ఫార్మాట్లోనూ సెంచరీ నమోదు చేయలేదు.
"కుంబ్లే లాంటి ఆటగాడిని తప్పించారు. రవిశాస్త్రి కోచ్‌గా వచ్చాడు. అతడికి ఆ అర్హత ఉందో లేదో నాకు తెలియదు. శాస్త్రిని నియమించడంలో కోహ్లీ కాకుండా ఇతర వ్యక్తుల పాత్ర కూడా ఉందనే భావిస్తున్నా. అతను ఒక వ్యాఖ్యాత. కోచింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. అదే ఇప్పుడు బెడిసికొడుతోంది. అతడు కోచ్ కాకపోయి ఉంటే.. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఉండేవాడు కాదు"
-రషీద్ లతీఫ్, పాక్ మాజీ క్రికెటర్
టీమ్ డైరెక్టర్‌గా ఉన్న శాస్త్రిని.. సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ కోచ్‌గా నియమించింది. ఐసీసీ ప్రపంచకప్ అనంతరం 2021 టీ20 ప్రపంచకప్ వరకు.. 2019లో అతడు తిరిగి భారత ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. శాస్త్రి రిటైర్మెంట్ అనంతరం రాహుల్ ద్రవిడ్.. ఆ బాధ్యతలను చేపట్టాడు.
ఇదీ చూడండి: Virat Kohli Covid: విరాట్ కోహ్లీకి కరోనా.. అక్కడికి వెళ్లిన తర్వాతే..!