Rashid Latif on Kohli Rohit: పాకిస్థాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ భారతీయులను కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇటీవల పాకిస్థాన్ జట్టులో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ అత్యద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో రాణిస్తూ అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాల రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఓ టీవీ ఛానెల్లో వారిద్దరినీ పొగిడిన లతీఫ్.. భారతీయులను తక్కువ చేసి మాట్లాడాడు.
"ఏడాది క్రితం మనం పాకిస్థాన్ జట్టులో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు లేరని అనుకునేవాళ్లం. అయితే, మరికొన్ని రోజుల్లో భారతీయులు కూడా మా జట్టులో రిజ్వాన్, బాబర్ వంటి ఆటగాళ్లు లేరని అనుకుంటారు" అని లతీఫ్ పేర్కొన్నాడు.

రిజ్వాన్, బాబర్, ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జంటగా నిలిచారు. అలాగే ఏడు శతక భాగస్వామ్యాలు నెలకొల్పి (రోహిత్-కేఎల్ రాహుల్ 6) రికార్డును బద్దలుకొట్టారు. ఈ క్రమంలోనే ఈ క్యాలెండర్ ఇయర్‌లో రిజ్వాన్ 2 వేలకు పైగా పరుగులు చేయగా.. బాబర్ 1600కు పైగా పరుగులు చేశాడు. దీంతో వీరిద్దరూ ప్రపంచంలోనే మేటి ఓపెనర్లుగా రాణిస్తున్నారు.