Rahul Dravid on Teamindia ODI Team: భారత్ వన్డే జట్టులో సమతౌల్యం లోపించిందని హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. జట్టులోని ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు హార్థిక్ పాండ్య, రవీంద్ర జడేజా లేని లోపం స్పష్టంగా కనిపించిందని అభిప్రాయపడ్డాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేసిరీస్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమై సిరీస్‌ను కోల్పోవడం కె.ఎల్. రాహుల్ కెప్టెన్సీపై ప్రభావం చూపబోదని ద్రవిడ్ పేర్కొన్నాడు.
వన్డే ఫార్మాట్‌లో జట్టు కూర్పులో పునఃసమీక్షించుకోవడంపై ద్రవిడ్ స్పందిస్తూ.. "జట్టులోని 6,7,8 స్థానాల్లో మాకు ఆల్‌రౌండ్ ఆప్షన్లు అందించేవారు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. త్వరలో అందుబాటులోకి వస్తారనుకుంటున్నాను. వారు రావడంతోనే మా జట్టు మరింత బలపడుతుంది. అప్పుడు మరింత భిన్నంగా ఆడేందుకు అది సహకరిస్తుంది" అని పేర్కొన్నాడు. ద్రవిడ్ అభిప్రాయం గాయాల నుంచి కోలుకుని పాండ్యా, జడేజాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని చెబుతోంది.
కేఎల్ కెప్టెన్సీలో ఇబ్బందేమీ లేదు..
Rahul Dravid KL Rahul Captaincy: కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కోచ్ ద్రవిడ్ పూర్తిగా వెనుకేసుకొచ్చాడు. ప్రస్తుత జట్టుతో ప్రయత్నలోపం లేకుండా కృషి చేశాడని పేర్కొన్నాడు. "కేఎల్ రాహుల్ బాగా కృషి చేశాడు. ఓడిపోయిన జట్టు వైపు ఉండటం అంత తేలికకాదు. అతడు ఇప్పుడే నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. జట్టు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చి వినియోగించుకోవడమే కెప్టెన్సీ అనే ముఖ్య విషయాన్ని నేర్చుకొంటాడు. మా వన్డే జట్టులో స్వల్ప కొరత ఉంది. ఉన్నంతలో మెరుగ్గా నాయకత్వ బాధ్యతలు నిర్వహించాడు. నిలకడగా నేర్చుకొంటూ మెరుగైన కెప్టెన్‌గా ఎదుగుతాడు" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
ఆ 20 ఓవర్లే కీలకం..
20-40 ఓవర్ల మధ్య టీమ్ఇండియా బ్యాటింగ్ మరికొంత మెరుగ్గా ఉండాల్సిందని ద్రవిడ్ ఓటములను విశ్లేషించాడు. "మిడిల్ ఓవర్లలో కచ్చితంగా మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసిన రెండు సార్లూ స్కోర్‌ను 290 దాటించింది. అవే మ్యాచుల్లో మనం 30వ ఓవర్ వద్ద దక్షిణాఫ్రికా కంటే మెరుగైన స్థితిలో ఉండాల్సింది. కానీ, పేలవమైన షాట్లు, నాసిరకమైన క్రికెట్ ఆడటం వల్ల అలా జరగలేదు" అని పేర్కొన్నారు.
నిలకడగా అవకాశాలిస్తాం.. వారు రాణించి తీరాల్సిందే..
శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు నిలకడగా జట్టులో స్థానం కల్పించడంపై ద్రవిడ్ స్థిరమైన అభిప్రాయంతో ఉన్నాడు. అదే సమయంలో క్రీడాకారులు కూడా అద్భుతమై ఆటతీరు ప్రదర్శించాలని సూచించాడు. "మేము నిలకడగా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాము. ఒక్కసారి వారికి స్థిరంగా అవకాశాలు రావడం మొదలయ్యాక.. మేము అద్భుతమైన ఆటతీరును డిమాండ్ చేస్తాం. దేశం తరపున ఆడుతున్న సమయంలో మంచి ఆటతీరు ఉండి తీరాల్సిందే. 4,5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు అవసరాలను గ్రహించి అందుకు తగినట్లు ఆడాలి’’ అని పేర్కొన్నారు. ఈ మూడు మ్యాచుల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో శ్రేయస్ అయ్యర్ విఫలమైన విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో ఆడాలనుకుంటే వెంకటేష్ అయ్యర్ ఫిట్‌నెస్‌ను మెరుగు పర్చుకోవాలని ద్రవిడ్ సూచించాడు. వెంకటేష్ అయ్యర్ వంటి వారు ఆరో బౌలర్ కింద ఉపయోగపడతార"ని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!