టీమ్ ఇండియాకు ఎంపికైన తెలుగు తేజం శ్రీకర్ భరత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే గత మూడు టెస్టుల్లో 8,6,23*,17,3 లాంటి స్కోర్లతో బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శనను కనబరిచినందున ఈ యువ బ్యాటర్‌పై వేటు పడే అవకాశాలున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే మరో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా అహ్మాదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ కోసం కఠోరమైన సాధనలో నిమగ్నమైపోయాడు. అంతే కాకుండా టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. అతని శిక్షణను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. దీంతో గురువారం ప్రారంభమయ్యే టెస్టుకు తుది జట్టులో ఇషాన్ పేరు కచ్చితంగా ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు మద్దతుగా మాట్లాడాడు. ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో భరత్ ప్రదర్శనపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ద్రవిడ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. భరత్ బ్యాటింగ్ విషయంలో తమకు ఎలాంటి ఆందోళనా లేదని స్పష్టం చేశాడు. అంతేగాక.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భరత్ చేసిన 17 పరుగులు జట్టుకు చాలా కీలకమయ్యాయని అన్నాడు. దీంతో భరత్‌కు నాలుగో టెస్టులో ఆడే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
"భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదు. అతడి దృక్పథంపై మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి. సవాళ్లు, పరిస్థితులను అర్థం చేసుకొని ఆడేందుకు ప్రయత్నిస్తాడు. మూడో టెస్టులో భరత్ గొప్పగా రాణించనప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో అతడు చేసిన 17 పరుగులు మాత్రం చాలా కీలకం. దిల్లీలోనూ చాలా పాజిటివ్‌గా ఆడాడు. కఠినమైన పిచ్‌లపై కాస్త అదృష్టం కలిసిరావాల్సి ఉంటుంది. కానీ, భరత్‌కు అదే కలిసిరాలేదు. అయితే, అతడు ఆడే విధానం బాగుంది. అందుకే భరత్ బ్యాటింగ్‌పై ఆందోళన చెందకుండా మరింత దృష్టిపెడతాం" అని భరత్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యానించాడు.
బ్యాటింగ్‌తో శ్రీకర్ భరత్ కాస్త నిరాశపరిచినప్పటికీ.. అతని కీపింగ్ నైపుణ్యం మాత్రం ఆకట్టుకుంది. డీఆర్‌ఎస్‌లు తీసుకోవడంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని దక్కించుకున్నాడు ఈ యువ ప్లేయర్. కాగా ఇప్పుడు నాలుగో టెస్టు భారత్‌కు కీలకంగా మారింది. ఇందులో విజయం సాధిస్తేనే టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు మెరుగవుతాయి. లేకుంటే తదుపరి ఆప్షన్ అయిన శ్రీలంక - న్యూజిలాండ్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి టీమ్ఇండియాకు ఏర్పడుతుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసియాలోనే అతి పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు దాదాపు లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేస్తోంది బీసీసీఐ. అంతే కాకుండా ఈ ఆఖరి పోరును వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ వస్తున్నారు.