కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అజింక్యా రహానెకు.. ఛెతేశ్వర్ పుజారా అండగా నిలిచాడు. రహానె గొప్ప ప్లేయర్ అని, అతడు మునుపటి ఫామ్ అందుకునేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలని పేర్కొన్నాడు. త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో అతడు సత్తా చాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"ప్రతి ఒక్క ఆటగాడి కెరీర్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. రహానె గొప్ప ఆటగాడు. అతడు మునుపటి ఫామ్‌ను అందుకుని.. బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో అతడు మెరుగ్గా రాణిస్తాడనుకుంటున్నా" అని పుజారా అన్నాడు.
అలాగే, టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా అజింక్యా రహానె ఫామ్‌పై స్పందించాడు. టెస్టుల్లో రహానె వరుసగా విఫలమవుతున్నా.. అతడిపై నమ్మకంతో తుదిజట్టులో చోటు కల్పించడం, కాన్పుర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అతడి అదృష్టమని గంభీర్ అన్నాడు. ఈసారి అయినా అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తున్నానన్నాడు.
తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కావడం వల్ల.. అజింక్యా రహానె కెప్టెన్‌గా, ఛెతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్లో స్థానం కోసం ఎదురు చూస్తుండటం వల్ల.. తొలి టెస్టులో రహానె విఫలమైతే.. అతడి కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.