టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) పునరాగమనం ఖాయమేనని ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్(Nasser Hussain) అంటున్నాడు. నిజానికి అతడు హెడింగ్లే టెస్టులోనే ఆడాల్సిందని పేర్కొన్నాడు. ఓవల్ టెస్టులో ఇషాంత్‌శర్మ స్థానంలో యాష్‌ను ఎంపిక చేయాలని సూచించాడు. నాలుగో టెస్టుకు(India vs England 4th test 2021) ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు.
"ప్రపంచ రెండో ర్యాంక్ బౌలర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్‌ఇండియాకు ఉన్నాడు. పైగా అతడో గొప్ప బ్యాట్స్‌మన్. ఐదు టెస్టు శతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అతడు హెడింగ్లే టెస్టులోనే ఆడాల్సింది. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో ఐదుగురు ఎడమ చేతివాటం ఆటగాళ్లు ఉన్నారు. అతడు ఓవల్‌లో కచ్చితంగా ఆడాలి"
-- నాసర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ సారథి.
'టీమ్‌ఇండియాకు ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న పరిష్కారం అశ్విన్ మాత్రమే. ఎవరైనా ఒక సీమర్ స్థానంలో అతడే జట్టులోకి రావాలి. హెడింగ్లేలో ఇషాంత్ ఇబ్బంది పడ్డాడు. బహుశా అతడి స్థానంలో యాష్ వచ్చి జడ్డూతో(Ravindra Jadeja) కలుస్తాడు. దాంతో జట్టుకు మరింత సమతూకం వస్తుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మరింత డెప్త్ పెరుగుతుంది' అని హుస్సేన్ తెలిపాడు.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో అశ్విన్‌కు ఇప్పటి వరకు చోటు దక్కలేదు. అతడు తుది జట్టులో లేకపోవడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు అత్యంత అనుభవంతో బౌలింగ్ చేయగలడని పేర్కొంటున్నాడు. యాష్ కేవలం 79 టెస్టుల్లోనే 413 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో హనుమ విహారితో కలిసి టీమ్‌ఇండియాను ఓటమి నుంచి రక్షించాడు. ఇక సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో పోరులో శతకం సాధించాడు.
ఇదీ చదవండి:Ind vs Eng: 'కోహ్లీసేన ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్ ఆడుతోంది'