Pujara Performance: టీమ్‌ఇండియా సీనియర్ బ్యాటర్ పుజారా సరిగ్గా ఆడకపోతే త్వరలోనే జట్టులో చోటు కోల్పోతాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నాడు. టీమ్‌ఇండియాలోకి వచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ లాంటి యువకులు ఎదురుచూస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లు రాణించాలని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాజీ సెలెక్టర్.. పుజారాపై స్పందించాడు.
"భారత బ్యాటింగ్ యూనిట్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కేఎల్ రాహుల్ మినహా ఎవ్వరూ రాణించడం లేదు. ప్రతిసారీ అతడిపైనే ఆధారపడలేం. అలాగే కెప్టెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అయితే ఇక్కడ పుజారా గురించి చెప్పుకోవాలి. అతడు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడి స్థానంలో ఇటీవల న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన శ్రేయస్ లాంటి యువకులు ఎదురుచూస్తున్నారు. పుజారా లాంటి సీనియర్ బ్యాటర్ తరచూ ఇలాగే విఫలమైతే త్వరలోనే చోటు కోల్పోవాల్సి ఉంటుంది" అని శరణ్‌దీప్ వివరించాడు.
"మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్‌లో టీమ్‌ఇండియా ఒక జట్టుగా బాగా ఆడుతోంది. అక్కడ సిరీస్ గెలుస్తారనే పూర్తి నమ్మకం ఉంది. ఇక సఫారీల గురించి మాట్లాడితే.. వాళ్లు సిరీస్ గెలవడం కోసం కాకుండా ఏదో ఆడాలన్నట్లు ఆడుతున్నారు. ఇప్పుడు ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో బలహీనంగా ఉంది. రెండో టెస్టు నుంచి క్వింటన్ డికాక్ కూడా వైదొలుగుతున్నాడు. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలహీన పడనుంది. అలాగే భారత బౌలింగ్ దళం కూడా అద్భుతంగా పనిచేస్తోంది. ఇషాంత్ స్థానంలో ఆడుతున్న సిరాజ్ చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. బుమ్రా అయితే టీమ్‌ఇండియాకు మాస్టర్ పీస్‌గా కొనసాగుతున్నాడు. దీంతో కచ్చితంగా కోహ్లీసేన సిరీస్ గెలుస్తుందనే అనుకుంటున్నా" అని మాజీ సెలెక్టర్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: IND Vs SA: 'ఐపీఎల్ వల్లే భారత పేసర్లు అలా'