Pujara about South africa tour: టీమ్‌ఇండియా బ్యాటర్లకు దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొనే సత్తా ఉందని టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. అనుభవమున్న ఆటగాళ్లతో ప్రస్తుతం భారత బ్యాటింగ్ విభాగం బలంగా ఉందని పేర్కొన్నాడు. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై కూడా భారత్ సమర్థంగా రాణించగలదని చెప్పాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఇటీవల విదేశాల్లో మెరుగ్గా రాణిస్తోందని.. దక్షిణాఫ్రికాలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"విదేశీ పిచ్‌లపై ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం టీమ్‌ఇండియాకు ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు మేం సిద్ధమయ్యాం. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో.. ఎక్కువ మంది గతంలో ఇక్కడ ఆడిన వాళ్లే. అది మా జట్టుకు కలిసొచ్చే అంశం. దానికి తోడు భారత బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. ఇక్కడ ఎదురయ్యే కఠిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం. కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమ్‌ఇండియా సాధించిన విజయాలు మాలో ఆత్మవిశ్వాసం నింపాయి. విదేశాల్లో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించి.. సిరీస్‌లు గెలవగలమనే నమ్మకాన్ని కలిగించాయి" అని పుజారా పేర్కొన్నాడు.
సత్తా చూపడానికి ఇదే సరైన సమయం : మాజీ కోచ్ రవిశాస్త్రి
దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచేందుకు టీమ్‌ఇండియాకు ఇదే సరైన సమయమని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. "విరాట్ కోహ్లీ లాంటి గొప్ప నాయకుడితో పాటు ప్రతిభ కలిగిన ఎంతో మంది ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. అందుకే, టీమ్ఇండియాకు తన సత్తాను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం. సఫారీల గడ్డపై ఇప్పటి వరకు భారత్ సిరీస్ సాధించలేకపోయింది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా ఎప్పుడూ బలమైన జట్టే. అయితే, అందుకు తగ్గ అస్త్రాలు టీమ్‌ఇండియా అమ్ముల పొదిలో చాలా ఉన్నాయి. ఎప్పటిలాగే, భారత జట్టుకు నా పూర్తి సహకారం ఉంటుంది" అని రవిశాస్త్రి అన్నాడు. టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ఇటీవల ముగిసింది.