శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడంపై కెప్టెన్ శిఖర్ ధావన్(Sikhar Dhawan) సంతోషం వ్యక్తం చేశాడు. తమ యువకులు బాగా ఆడారని మెచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గబ్బర్.. ఈ టీమ్‌ఇండియా జట్టులో కొత్త ఆటగాళ్లున్నా చాలా మంది ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్ ఆడారన్నాడు. యువ క్రికెటర్లు ఎంతో పరిణితి కలిగిన ఆటగాళ్లని ప్రశంసించాడు.
"మా జట్టులో చాలా మంది ఇదివరకే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. వాళ్లెంతో పరిణతి చెందిన ఆటగాళ్లు. ఇలా ఆడటం చాలా ఆనందంగా ఉంది. వికెట్ ఫ్లాట్‌గా ఉందని తెలుసు. అయితే, మా ముగ్గురు స్పిన్నర్లు పదో ఓవర్ నుంచే శ్రీలంకపై ఒత్తిడి తెచ్చారు. మేం ఛేదనకు దిగినప్పుడు కూడా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో నుంచి మా ఆటగాళ్ల బ్యాటింగ్ చూడటం గొప్పగా ఉంది. ఐపీఎల్‌లో ఆడటం వల్ల మంచి అవగాహన సంపాదించుకున్నారు. వాళ్ల ఆత్మవిశ్వాసం మెరుగుపడింది. పృథ్వీ, ఇషాన్(Prithvi shah, Ishan kishan) ఆడిన తీరు అత్యద్భుతం. వాళ్లు 15 ఓవర్లలోనే మ్యాచ్‌ను పూర్తి చేశారు. ఇక నా బ్యాటింగ్ గురించి మాట్లాడితే శతకం బాదాలని అనుకున్నా. కానీ, అక్కడ ఎక్కువ పరుగులు లేకపోయాయి. దాంతో చివరివరకు నాటౌట్‌గా నిలవాలనుకున్నాను"
-ధావన్, ఈ సిరీస్‌కు కెప్టెన్.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4), కెప్టెన్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1x6) అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలోనే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో 8x4, 2x6), మనీశ్ పాండే (26; 40 బంతుల్లో 1x4, 1x6), సూర్యకుమార్ (31 నాటౌట్; 20 బంతుల్లో 5x4) ధాటిగా ఆడి తమవంతు పరుగులు చేశారు. దాంతో భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బోణి కొట్టింది. రెండో వన్డే మంగళవారం ఇదే మైదానంలో జరగనుంది.
ఇదీ చూడండి: ఆ ఘనత సాధించిన పదో ఆటగాడిగా ధావన్