India Vs West Indies 3rd T20 : ఎక్కడైతే 2 వికెట్ల తేడాతో ఓడి వెనుకబడిందో అదే చోట మూడో టీ20 కోసం టీమ్ఇండియా రంగంలోకి దిగనుంది. ఒక్క రోజు విరామం తర్వాత గయానాలోని ప్రావిడెన్స్ వేదికగా.. వెస్టిండీస్‌ను భారత్ ఢీకొట్టనుంది. అయితే మందకొడి పిచ్‌లపై తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చెలరేగుతున్న విండీస్ బౌలర్లను మరోసారి ఎదుర్కోవడం అంటే భారత బ్యాటర్లకు పరీక్షే. ఇక విధ్వంసకర ఆటగాడు పూరన్‌ను మన బౌలర్లు నిలువరించాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకుంటే 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో టీమ్‌ఇండియాకు తొలి ఓటమి తప్పదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ విజయానికి చేరువగా వచ్చి.. దూరమైన టీమ్‌ఇండియా ఈ సారి ఎలా ఆడుతుందో అన్న ప్రశ్న తలెత్తుతోంది.
Ind Vs WI T20 : అయితే విండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ తెలుగబ్బాయి.. ఆ మ్యాచ్‌లో 39 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ 20 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో టీ20లోనూ అదే జోరును ప్రదర్శంచి అర్ధశతకాన్ని అందుకున్నాడు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న తిలక్ రానున్న మ్యాచ్‌లోనూ జోరు సాగించేలా ఉన్నాడు. అయితే అతనితో పాటు జట్టులోని మిగతా బ్యాటర్లు రాణిస్తే టీమ్ఇండియా గెలుపు బాటలో నడవగలదు.
మరోవైపు బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలంటూ కెప్టెన్ హార్దిక్ కూడా చెప్పాడు. మరి శుభ్‌మన్, సూర్యకుమార్, సంజు శాంసన్, ఇషాన్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. అయితే బ్యాటింగ్‌లో దూకుడు లోపించిందన్నది నిజం. సూర్య అంచనాలను అందుకోలేకపోవడం కూడా ఆ జట్టును దెబ్బతీస్తోంది. బంతితో, బ్యాట్‌తో పర్వాలేదనిపిస్తున్న కెప్టెన్ హార్దిక్.. సారథిగా వ్యూహాల విషయంలో మరింత దృష్టి సారించాల్సి ఉంది. రెండో టీ20లో ఆఖర్లో వికెట్లు తీసిన చాహల్‌కు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకపోవడంతో పాటు అక్షర్‌ను వాడుకోకపోవడం లాంటి నిర్ణయాలు విమర్శల పాలయ్యాయి.
ఇక గత రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ విండీస్ బౌలర్లు రాణించినంతగా మన బౌలర్లు క్రీజులో ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యర్థి పేసర్లు పరిస్థితులను చక్కగా అంచనా వేస్తూ వైవిధ్యమైన బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బకొడుతున్నారు. స్లో డెలివరీలు, షార్ట్ పిచ్ బంతులతో వికెట్లు సాధిస్తున్నారు. భారత పేసర్లలో హార్దిక్ మాత్రమే గత మ్యాచ్‌లో సత్తాచాటాడు. ముకేశ్, అర్ష్‌దీప్ లాంటి ప్లేయర్స్ కీలక సమయాల్లో పరుగులిచ్చేశారు. ముఖ్యంగా ముకేశ్ పరుగుల కట్టడిలో విఫలమవుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్ కోసం అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్ లేదా అవేష్ ఖాన్‌ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు స్పిన్నర్లలో చాహల్ నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. కుల్‌దీప్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్ గత మ్యాచ్‌లో పూరన్‌ను ఆపలేకపోయాడు. ఫిట్‌గా ఉంటే కుల్‌దీప్ తుది జట్టులో ఆడతాడు.
జట్లు (అంచనా)...
భారత్: ఇషాన్, సూర్యకుమార్, తిలక్, సంజూ శాంసన్, హార్దిక్, , శుభ్‌మన్, అక్షర్, రవి బిష్ణోయ్/కుల్‌దీప్, అర్ష్‌దీప్, చాహల్, ముకేశ్/ఉమ్రాన్/అవేష్ ఖాన్
వెస్టిండీస్: కింగ్, మేయర్స్, ఛార్లెస్, పూరన్, పావెల్, హెట్‌మయర్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్, హోల్డర్, అకీల్, మెకాయ్.
'ఇది కెప్టెన్సీనా? అలా చేసి ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం'.. పాండ్యపై టీమ్ఇండియా ఫ్యాన్స్ ఫైర్
ప్రపంచకప్‌కు ఇంకా 9 వన్డేలే.. టీమ్‌ఇండియాలో నాలుగో స్థానం పరిస్థితేంటి?.. ఛాన్స్ ఎవరికి?