క్రికెటర్లకూ వ్యక్తిగతం జీవితం ఉంటుంది. వారూ కొన్ని విషయాల్లో అసంతృప్తి చెందొచ్చు, కామెంట్లూ, ట్వీట్లూ చేయొచ్చు. కానీ ఇది అతడికి, దేశ క్రికెట్ బోర్డుకు ఎలాంటి చెడ్డపేరు తీసుకువచ్చేలా ఉండకూడదు. వారు చేసిన ట్వీట్ కనుక ఏదైనా ఇబ్బందిని తెచ్చిపెడితే వెంటనే అతడి కెరీర్ చిక్కుల్లో పడొచ్చు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొందరు క్రికెటర్లు మాత్రం కొన్ని వివక్షపూరిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతకీ వాళ్లెవరు? ట్వీట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
ఒల్లీ రాబిన్సన్ (Ollie Robinson)
ఇంగ్లాండ్ యువ బౌలర్ ఒల్లీ రాబిన్సన్ (Ollie Robinson)ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆ దేశ బోర్డు ఇటీవల నిషేధించింది. ఎనిమిదేళ్ల క్రితం స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలపై ట్వీట్(Controversial Tweet) ఇందుకు కారణమని పేర్కొంది. అతడు ఎప్పుడో 12 ఏళ్ల క్రితం చేసిన ఈ ట్వీట్ తన కెరీర్‌ను గందరగోళంలో పడేసింది.
అంబటి రాయుడు (Ambati Rayudu)
2019 వన్డే ప్రపంచకప్‌లో రాయుడును కాదని విజయ్ శంకర్‌ను ఎంపికచేసింది బీసీసీఐ. విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణిస్తాడని, అతడు త్రీడీ ఆటగాడని అప్పటి భారత జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఈ విషయంపై రాయుడు స్పందిస్తూ.. "ప్రపంచకప్‌ను చూడటానికి త్రీడీ కళ్లజోడు ఆర్డర్ చేశాను" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ త్రీడీ ట్వీట్ రాయుడు కెరీర్ ముగిసేలా చేసిందని చెప్పవచ్చు. ఈ టోర్నీలో విజయ్ శంకర్ గాయపడగా.. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంది బోర్డు. దీనిపై అసంతృప్తితో రిటైర్మెంట్ ప్రకటించాడు రాయుడు. కానీ కొంతకాలానికే యూటర్న్ తీసుకున్నాడు.
కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen)
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ వివాదాలకు పెట్టింది పేరు. ఇతడు చాలాసార్లు తన విమర్శనాత్మక వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డాడు. 2010లో పాకిస్థాన్ పర్యటనకు తనను ఎంపికచేయకపోవడంపై ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఈసీబీ సీరియస్ కావడం వల్ల వెంటనే ఆ ట్వీట్‌ను డిలిట్ చేశాడు. మళ్లీ 2012లో ఇంగ్లీష్ క్రికెటర్ నిక్ నైట్ కామెంటరీ బాక్స్‌లో ఉండటాన్ని ఉద్దేశిస్తూ 'హాస్యాస్పదం' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీబీ.. భారీ జరిమానా విధించింది.
ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim)
2016 ప్రపంచకప్ హోరాహోరీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది టీమ్ఇండియా. ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను చివరి బంతికి రనౌట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు ధోనీ. అయితే కొద్దిరోజులకే సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది భారత్. దీనిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు బంగ్లా క్రికెటర్ రహీమ్. "సంతోషం అంటే ఇది. హహహా. సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయింది" అంటూ చేసిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అతడిపై ట్రోల్స్ వర్షం కురిపించారు ఫ్యాన్స్. దీంతో అతడు ఆ ట్వీట్‌ను తొలగించాడు.
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)
సూర్య కుమార్ వివాదాస్పద క్రికెటరే అయినా ఈ మధ్య కోపం తగ్గించుకుని కుదురుకుంటున్నాడు. 2017లో ముంబయి జట్టులో అతడికి చోటు దక్కకపోవడం వల్ల ట్వీట్ చేస్తూ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. దానిపై తర్వాత విచారణ కోరింది ముంబయి క్రికెట్ అసోసియేషన్. సెలక్షన్‌పై ప్రశ్నించే హక్కు క్రికెటర్లకు లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ సంఘటనను మరిచిపోయిన సూర్య.. కొంతకాలానికే టీమ్ఇండియాకు ఆడే స్థాయికి ఎదిగాడు.