Pak vs India Shahid Afridi: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను ఓడించింది. ఐసీసీ ప్రపంచకప్‌ల చరిత్రలో చిరకాల ప్రత్యర్థితో భారత్‌కు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ పేసర్ షహీన్ అఫ్రిది ఒత్తిడికి గురయ్యాడని, దాంతో తనకు ఫోన్ చేశాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"టీమ్‌ఇండియాతో తన తొలి గేమ్ ఆడకముందు షహీన్ నాకు వీడియోకాల్ చేసి ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు. మేం సుమారు 12 నిమిషాలు మాట్లాడుకున్నాం. దాంతో.. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ ప్రదర్శన చేయ్. టీమ్‌ఇండియా వికెట్లు తీసి హీరో అవ్వు" అని అతడికి సూచించానని అఫ్రిది అన్నాడు.
ఇక తాను ఆడే రోజుల్లో టీమ్ఇండియాతో మ్యాచ్ అంటే.. ముందురోజు రాత్రి నిద్ర పట్టకపోయేదని కూడా గుర్తుచేసుకున్నాడు షాహిద్. "నేను ఆడే రోజుల్లోనూ.. మా జట్టు ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అస్సలు నిద్రపోయేవాళ్లు కాదు. కొందరైతే ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆరంభమవుతుందా అని ఎదురుచూసేవాళ్లు. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు తమ పనులను పక్కనపెట్టి మరీ భారత్-పాక్ మ్యాచ్‌లను తిలకించేవారు" అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: అతడే బెస్ట్ కెప్టెన్.. బాబర్ కాదు: షాహీన్ కీలక వ్యాఖ్యలు