Nz vs Bangladesh: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించి.. కివీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎబాదత్ హుస్సేన్‌కు దక్కింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా.. 16.5ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 328 పరుగులకే ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కాన్వే (122) సెంచరీతో మెరవగా నికోలస్ (75), విల్ యంగ్ (52) ఆకట్టుకున్నారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 458 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ (88), లిటన్ దాస్ (86), మహ్మదుల్ హసన్ (78), షంటో (64) రాణించారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 130 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 169 పరుగులకే కుప్పకూలగా.. 39 పరుగల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగిన బంగ్లా లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది.
ఇది సమష్టి విజయం
"ఇది సమష్టి విజయం. మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. గతరెండు టెస్టు మ్యాచుల్లో మేము అంతగా ఆడలేకపోయాం. కానీ ఇక్కడ మంచి ఆరంభం లభించింది. ఈ విజయాన్ని ఇక్కడే మరిచిపోయి రెండో టెస్టులో మరింత ఉత్తమంగా రాణించేలా ప్రయత్నం చేస్తాం" అని బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ హర్షం వ్యక్తం చేశాడు.
రికార్డులు
ఈ విజయంతో బంగ్లాదేశ్ కొన్ని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
- కివీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు దక్కింది.
- అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఇదే మొట్టమొదటి గెలుపు. 2001 నుంచి ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 32 మ్యాచులు అన్నింటిలోనూ ఓటమి చెందింది.
- విదేశీ గడ్డపై టాప్-5లో ఉన్న జట్టును ఓడించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: ఒకే మ్యాచ్‌లో రెండు వివాదాస్పద క్యాచ్‌లు.. అభిమానులు గుస్సా!