టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ మురళీ విజయ్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాలుపంచుకోవట్లేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు అతడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నించారు. తాజాగా తమిళనాడు జట్టుకు సంబంధించిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం.. అతడికి కరోనా వ్యాక్సిన్ తీసుకునే ఉద్దేశం లేదట. అలాగే బయోబబుల్పైనా విముఖతతో ఉన్నాడని తెలుస్తోంది. అందువల్లే విజయ్ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదట.
"అది విజయ్ వ్యక్తిగత విషయం. అతడు వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా లేడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం టోర్నీ ప్రారంభం కావడానికి వారం రోజుల ముందు నుంచే క్వారంటైన్లో ఉండాలి. కానీ అందుకు విజయ్ సిద్ధంగా లేడు. అందుకే తమిళనాడు సెలెక్టర్లు అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు" అంటూ ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులు టోర్నీ బయోబబుల్‌లోకి ప్రవేశించడానికి ముందు వారంరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. ఈ సమయంలో చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలితే అతడికి బబుల్‌లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత టోర్నీ ఆసాంతం బబుల్‌లోనే గడపాలి. ఈ నిబంధనలు నచ్చకే విజయ్.. టోర్నీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అతడు వ్యాక్సిన్ వేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినా.. ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి మీడియాకు తెలియజేశారు.