ఇకపై తటస్థ వేదికల్లో తమకు సంబంధించిన సిరీస్‌లు నిర్వహించమని స్పష్టం చేశారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన ఓ అధికారి. పాక్ పర్యటనల్ని ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రద్దు చేసుకున్నాక ఈ సిరీస్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలన్న ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"పాకిస్థాన్ సురక్షితమైన దేశం. ఎలాంటి అంతర్జాతీయ టోర్నీ అయినా నిర్వహించడానికి మేం సిద్ధం. ఇకపై తటస్థ వేదికలు ఉండవు" అని పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
2005 తర్వాత తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది న్యూజిలాండ్. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఒక్క మ్యాచ్ ఆడకుండానే తిరుగుముఖం పట్టింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా పాక్ పర్యటనను రద్దు చేసుకుంది. తమకు ఆటగాళ్ల సంక్షేమం ముఖ్యమని వెల్లడించింది. 2009లో శ్రీలంక-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత అగ్రదేశాలతో వారి సిరీస్‌లను యూఏఈలో ఆడింది పాక్. ఇప్పుడు తటస్థ వేదికలు ఉండవని, పాక్ సురక్షితమైన దేశమని చెబుతోంది.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పర్యటనలు రద్దయ్యాక టీ20 ప్రపంచకప్ కంటే ముందు మరో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేదుకు సిద్ధమైంది పాక్. అందుకోసం కొన్ని బోర్డులను సంప్రదించింది. కానీ తర్వాత మనసు మార్చుకుని దేశవాళీ టోర్నీ నిర్వహణకు రెడీ అయింది.
"ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పర్యటన రద్దయ్యాక శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో ద్వైపాక్షిక సిరీస్ కోసం సంప్రదింపులు జరిపాం. లంక జట్టు ఒమన్‌లో జరగబోయే క్వాలిఫై టోర్నీ కోసం వెళ్లే అవకాశం ఉంది. బీ-టీమ్‌ను పంపేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. అలాగే జింబాబ్వే కూడా పాక్‌కు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ టీ20 ప్రపంచకప్‌నకు తక్కువ సమయం ఉన్న కారణంగా దేశవాళీ టీ20 టోర్నీ నిర్వహించాలని నిర్ణయించాం. ప్రధాన ఆటగాళ్లందరూ ఈ టోర్నీకి అందుబాటులో ఉంటారు. వరల్డ్‌కప్‌కు ఇది సన్నాహకంగా పనిచేస్తుంది."
-పీసీబీ అధికారి
వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనల గురించి స్పందిస్తూ.. "వారితో చర్చలు జరుపుతున్నాం. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సిరీస్ నుంచి తప్పుకొన్నాక పరిస్థితి అదుపుతప్పింది. కానీ భద్రత విషయంలో పర్యటక జట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము అన్ని రకాల సదుపాయాలు సమకూర్చగలం. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలం" అని పీసీబీ అధికారి వెల్లడించారు.