అభిమానులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. నితీశ్ రానా పేరును వెల్లడించింది కేకేఆర్ యాజమాన్యం. తాజా సీజన్‌లో తమ జట్టుకు అతడే నాయకత్వం వహించనున్నాడని పేర్కొంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ కూడా చేసింది. వెన్ను నొప్పితో గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడిని నియమించింది. వాస్తవానికి కోల్‌కతా కొత్త కెప్టెన్ రేసులో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్‌తో పాటు విధ్వంసక ప్లేయర్ ఆండ్రూ రసెల్ పేర్లు వినిపించాయి. అయితే చివరికి వీరిందరినీ కాకుండా.. ఆటలో నిలకడగా రాణిస్తున్న రానా వైపు యాజమాన్యం మొగ్గు చూపింది.
"వెను నొప్పి గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌కు దూరమైన నేపథ్యంలో నితీశ్ రానాను కెప్టెన్‌గా ఎంపిక చేశాం. అతడు సారథిగా జట్టును సమర్ధంగా నడిపిస్తాడని భావిస్తున్నాం. అతడు తన బాధ్యతను గొప్పగా నిర్వర్తిస్తాడు అనే నమ్మకం మాకుంది. శ్రేయస్ త్వరగా కోలుకోని ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. వైట్ బాల్ క్రికెట్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం, అలాగే ఐపీఎల్‌లో 2018 నుంచి కేకేఆర్ జట్టుతో అతడికి ఉన్న అనుభవం కారణంగా ఎంపిక చేశాం. ఆఫ్ ఫీల్డ్‌లో హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, ఇతర సపోర్ట్ స్టాఫ్, ఆన్ ఫీల్డ్‌లో జట్టులో అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లు నితీశ్‌కు అండగా ఉంటారని మేం ఆశిస్తున్నాం. కొత్త బాధ్యతలు స్వీకరించిన అతడి మా తరఫున అభినందనలు. అని వ్యాఖ్య రాసుకొచ్చింది. ’
2018 నుంచి జట్టుతో.. నితీశ్ రానా ఐపీఎల్‌లో ఓపెనర్‌గా బాగా ఆకట్టుకున్నాడు. 2018 నుంచి కోల్‌కతా జట్టులో కొనసాగుతున్నాడు. కేకేఆర్ తరఫున 74 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 135.61 స్ట్రైక్ రేట్‌తో 1744 పరుగులు చేశాడు. గత ఐదు సీజన్లలో 300లకుపైగా పరుగులు చేసి నిలకడగా రాణిస్తున్నాడు. అలానే దేశవాళీ టోర్నీలో దిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. దిల్లీ జట్టు తరఫున 12 టీ20లకు సారథ్యం వహించాడు. అందులో ఆ జట్టుకు ఎనిమిది సార్లు విజయాన్ని అందించిన అతడు.. నాలుగు సార్లు ఓటమిని అందించాడు. 2021లో టీమ్ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు. అయితే శ్రీలంక టూర్లో రెండు టీ20లు, ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 31నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్ ఆరంభం కానుంది. ఇకపోతే ఈ సీజన్‌లో కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 1న పోటీపడనుంది.
తిరగబెట్టిన వెన్నునొప్పి.. ఇకపోతే శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో అతడికి గాయం తిరగబెట్టింది. దీంతో ఆ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్ చేయలేదు. అలాగే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. త్వరలోనే అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
ఇదీ చూడండి: పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యాను.. హెచ్ఐవీ టెస్ట్ చేసుకున్నాను: ధావన్