BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ ఇంకొన్ని రోజులే కొనసాగనున్నాడు! తిరిగి అతడు అధ్యక్ష రేసులో పోటీపడే అవకాశాలు లేనట్లే. మరి అతడి స్థానం ఎవరిది అన్న దానిపై ఇప్పటికే బోర్డు సీనియర్లు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు కావొచ్చని సమాచారం. ఈనెల 18న జరిగే ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనే ఓటర్ల జాబితాలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) తరఫున బిన్నీ పేరు ఉండటమే ఇందుకు కారణం. గతంలో కేఎస్‌సీఏ కార్యదర్శి సంతోష్ మేనన్ బోర్డు ఏజీఏంలో పాల్గొన్నాడు. కొత్త కార్యవర్గంలో ఎవరుండాలి అన్న విషయంలో దిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ఆఫీస్ బేరర్లతో పాటు గతంలో కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన సీనియర్లు ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ‘‘ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్య కేబినెట్ మంత్రి ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆయన మాట అందరూ వింటారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీపడతాడని.. జై షా బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగుతాడని కథనాలు వినిపిస్తున్నాయి. బోర్డు ఎన్నికలకు ఈనెల 11, 12 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయొచ్చు.
ఇవీ చదవండి: మొన్న జడేజా.. నిన్న బుమ్రా.. నేడు చాహర్.. టీమ్ఇండియాకు గాయాల బెడద వీడదా?
బుమ్రా, జడేజా లేడని నిరాశ వద్దు.. మరో ఆటగాడికి అద్భుత అవకాశం: రవిశాస్త్రి