ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship)పై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ(Brett Lee). బలాబలాల పరంగా చూస్తే భారత్, కివీస్ సమానంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఇంగ్లాండ్ పరిస్థితులు దృష్ట్యా కివీస్ కాస్త పైచేయి సాధించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు.
"రెండు జట్లూ సమవుజ్జీల్లాగా కనిపిస్తున్నాయి. అయితే ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఎక్కువగా బౌలింగ్ చేసిన అనుభవం కివీస్ బౌలర్లకు ఉంది. వారి దేశంలోనూ పరిస్థితులు ఇక్కడితో పోలి ఉంటాయి. పేస్, స్వింగ్ బౌలింగ్ కోణంలో చూస్తే కివీస్‌కు కచ్చితంగా సానుకూలత ఉంటుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే రెండు జట్లలోనూ స్వింగ్ బౌలింగ్‌ను బాగా ఆడగల బ్యాట్స్‌మెన్ ఉన్నారు. బౌలింగ్‌లో ఎవరు పైచేయి సాధిస్తే వాళ్లే డబ్ల్యూటీసీ ఫైనల్లో విజేతలుగా నిలుస్తారు" అని బ్రెట్ లీ తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ(Virat Kohli), విలియమ్సన్ల మధ్య కెప్టెన్సీ సమరం ఆసక్తి రేకెత్తించే అంశమని లీ చెప్పాడు. "కేన్ శైలి కొంచెం సంప్రదాయ పద్ధతిలో ఉంటుంది. అతను ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతాడు. అది తనకు, జట్టుకు మేలు చేస్తుంది. కానీ అవసరమైనపుడు దూకుడుగా వ్యవహరించడానికీ విలియమ్సన్(Williamson) వెనుకాడడు. కోహ్లీ ఎల్లప్పుడూ చాలా దూకుడుగా ఉంటాడు. వీళ్లిద్దరిలో ఎవరి శైలి సరైందని చెప్పడం కష్టం. ఎందుకంటే నేను రెండు రకాల కెప్టెన్లతోనూ పని చేశాను. డబ్ల్యూటీసీ ఫైనల్లో విభిన్న శైలి ఉన్న ఇద్దరు సారథుల మధ్య సమరం ఎంతో ఆసక్తి రేకెత్తించేదే. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి" అని లీ అన్నాడు.
ఇదీ చదవండి: Dhoni: 'ధోనీ గురించి ఒక్కమాట సరిపోదు'